నేటి కాలంలో మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోయింది. ఏ ఒక్కరిలోనూ సర్దుకునే మనసత్వం లేకుండా పోతుంది. ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా మర్చిపోయారు. కూతురు – అల్లుడి మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించాల్సిన మామ.. తన అల్లుడితో గొడవ పెట్టుకున్నాడు. మామ – అల్లుడి మధ్య చెలరేగిన గొడవ వియ్యంకురాలి హత్యకు దారితీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలలోని సాయిరాం నగర్ కు చెందిన వెన్న మహేష్.. తన కుమార్తె గంగభవానీని పురాణి పేటకు చెందిన గట్ల కిరణ్ కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. వారికి ఓ బాబు పుట్టిన కొద్దిరోజులకు విభేదాలు రావటం మొదలయ్యాయి. వీరి మధ్యగొడవలు తారాస్థాయికి చేరి గంగభవానీ తన పుట్టింటికి వెళ్లింది.
వీరి గొడవల విషయమై పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా ఇరువురి మధ్య ఎలాంటి మార్పు రాలేదు. తన కూతురితో అల్లుడు నిత్యం గొడవ పెట్టుకుంటున్నాడని మహేష్ అల్లుడి పై కోపం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం.. మామ మహేష్ అల్లుడు కిరణ్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. వీరి మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఆవేశానికి గురైన మహేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కిరణ్ పై దాడికి యత్నించాడు. వెంటనే కిరణ్ ఆ కత్తి వేటు నుంచి తప్పించుకున్నాడు.
కిరణ్ తప్పించుకోవడంతో అతని తల్లి యమున పై మహేష్ దాడి చేశాడు. ఆమె మెడ, వెన్ను భాగంలో ఎనిమిది కత్తి పోట్లు దిగడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె చనిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్యభర్తలు మధ్య జరిగిన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానలా పెద్దదై ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.