ఉమ్మడి విశాఖ జిల్లా: అనకాపల్లి సమీపంలోని రావికమతంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ఇష్టం లేదని యువతి కాబోయే భర్త గొంతు కోసింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. పాడేరుకు చెందిన రాము నాయుడుతో రావికమతం గ్రామానికి చెందిన యువతికి ఈ ఏడాది మే 28న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించి ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో రాము నాయుడు జాబ్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ నుండి పాడేరుకు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి ఓసారి కలవాలని చెప్పి రాముని రావికమతంలోని తన ఇంటికి పిలిచింది.
ఆ తర్వాత ఏకాంతంగా మాట్లాడాలని ఇంటికి సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లింది. తీరా గుట్టపైకి చేరుకున్నాక సర్‌స్రైజ్ అని రాముని కళ్లు మూసుకోవాలని చెప్పింది. కాబోయే భార్యే కదా.. అని రాము కళ్లు మూసుకున్నాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో రాము గొంతు కోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన రాము కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
హుటాహుటిన కుటుంబ సభ్యులు రావికమతం చేరుకొని రాముని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముతో పెళ్లి ఇస్టం లేదని చెప్పినా వినకుండా తమ పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని యువతి పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యువతికి ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.