Call Money: కాల్ మనీ కోరలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి. నిత్యం ఎవరో ఒకరు కాల్ మనీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రాక్షసులు పేదల నుంచి అధిక వడ్డీలు గుంజుతూ వారి రక్తం తాగుతున్నారు. తాజాగా, కాల్ మనీ వడ్డీ వ్యాపారుల అకృత్యాలు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సేలం జిల్లా, సెంగోడనుర్‌కు చెందిన సురేష్ ఓ నిరుపేద కూలీ. వారానికి 2వేల ఆదాయంతో భార్య, పిల్లల్ని పోషిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం డబ్బు అత్యవసరమై వడ్డీ వ్యాపారులైన సేతు, దురై దగ్గర అప్పు చేశాడు. అయితే, తీసుకున్న దాని కంటే పది రెట్లు ఎక్కువ వడ్డీ కట్టాడు. మొత్తం 4 లక్షల 80 వేలు చెల్లించాడు. అయినా కూడా వడ్డీ వ్యాపారుల ధన దాహం తీరలేదు. ఇంకో ఐదు లక్షలు చెల్లించాలని బెదిరించసాగారు.
వారి వేధింపులు రోజురోజుకు ఎక్కువవసాగాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీయటం మొదలుపెట్టాడు. ఆ సెల్ఫీ వీడియోలో‘‘ నేను వారానికి 2వేల రూపాయల పని చేస్తున్నాను. నా సంపాదన మొత్తం వడ్డీ వ్యాపారులకు కట్టడానికే సరిపోతోంది. నేను నా పిల్లలకు ఓ జత బట్టలు కూడా కొనలేకపోతున్నా.. నా భార్యకు కూడా ఏమీ కొనలేకపోతున్నా.
నేను వడ్డీలు కట్టలేను. ఆ బాధతో నా భార్యపై చెయ్యి చేసుకున్నా.. తను ఎటో వెళ్లిపోయింది. నా కిక బతకాలని లేదు. నా భార్యాబిడ్డల్ని బాగా చూసుకోండి. వాళ్లను వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో ఉన్న సురేష్‌ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది. సురేష్ ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, సురేష్ సెల్ఫీ సూసైడ్ అటెంప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నీచ డాక్టర్.. ఆపరేషన్ జరుగుతుండగా గర్భిణులపై అత్యాచారం!