సమాజంలో ప్రేమ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అవసరాలు తీర్చుకుని పెళ్లి అనేసరికి ముఖం చాటేసేవారు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వారి చేతిలో మోస పోయిన వాళ్లు మాత్రం ఎదిరించలేక.. సమాజంలో తమ పరువు ఏమైపోతుందో అనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ బాధితురాలి కథే ఇది. కానీ, ఇక్కడ ఆమె మొదట ఆత్మహత్యకు ప్రయత్నించినా.. తర్వాత ధైర్యం చేసి ప్రేమించిన వాడికి దేహశుద్ధి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో జరిగింది. చిన్నటేకూరుకు చెందిన శేఖర్, పెద్దటేకూరుకు చెందిన మున్నీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి శేఖర్ దాటవేస్తూ వచ్చాడు. అయితే మున్నీ పోలీసులకు చెప్పి తమ పెళ్లి చేయించమని కోరింది. పోలీలులు కూడా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ, శేఖర్ మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. మూడ్రోజుల క్రితం మున్నీ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రియుడికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది.
చిన్నటేకూరు వెళ్లి పెద్దల ముందే శేఖర్ పై కర్రతో దాడికి దిగింది. తాళి కట్టాలంటూ శేఖర్ ను చావకొట్టింది. అక్కడ ఉన్న పెద్దలు ఆపే ప్రయత్నం చేయగా.. మీ ఆడపిల్లలకు ఇలా జరిగితే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో అందరూ చూస్తుండిపోయారు. మున్నీ చేసిన పని కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.