Anliya Sad Story: ఆ తండ్రీ కూతుళ్ల మధ్య కేవలం రక్త సంబంధమే కాదు.. అంతకు మించిన స్నేహం బంధం కూడా ఉంది. ఒక్కగానొక్క కూతురిని తన ఆరోప్రాణంగా పెంచాడు. కూతురికి కొంచెం బాధ కలిగినా ఆమె కంటే తానే ఎక్కువ తల్లిడిల్లిపోయేవాడు. కూతురు కూడా తండ్రిని ఎంతో గౌరవించేది. ఆయన మాట జవదాటేది కాదు. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛను తండ్రికే వదిలేసింది. ఇలాంటి వారి జీవితాలతో విధి భయంకరమైన ఆట ఆడింది. ప్రాణంగా భావించిన కూతురి విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం వారి జీవితాలను తల్లికిందులు చేసింది.
ఆగస్టు 25, 2018 మధ్యాహ్నం 3.30
‘‘ ఇప్పుడే రైల్వే స్టేషన్‌కు వచ్చాను. బెంగళూరుకు వెళుతున్నాను. 8 గంటలకు ట్రైన్. నాతో పాటు జిస్టిన్ కూడా ఉన్నాడు’’ అని తమ్ముడు అభిషేక్‌కు మెసేజ్ చేసింది అనలియా. కొన్ని గంటల తర్వాత ఆమె తండ్రి హైగెనస్ పరక్కల్ ఫోన్‌కు జస్టిన్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ మామయ్య అనలియా కనిపించటం లేదు. మేమిద్దరం కలిసి త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఎటో వెళ్లిపోయింది’’ అని చెప్పాడు జస్టిన్. అదే రోజు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. అనలియా కోసం పోలీసులతో పాటు హైగెనస్, అభిషేక్ ఇతర బంధువులు వెతకటం ప్రారంభించారు.
ఆగస్టు 28, 2018
రాత్రి హైగెనస్‌కు పోలీసులనుంచి ఫోన్ వచ్చింది. అలువలోని పెరియార్ నదిలో అనలియా శవాన్ని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఆ వార్త విని హైగెనస్ గుండె పగిలింది. బాధతో కుప్పకూలిపోయాడు. అభిషేక్, అనలియా తల్లి లీలమ్మ తల్లి పరిస్థితి కూడా అంతే.. అయితే, తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న బాధకంటే తన కారణంగా కూతరు జీవితం నాశనం అయిందన్న బాధ ఆ తండ్రిని తీవ్రంగా వేధిస్తోంది. ( ‘‘జోకర్’’ వేషంలో నర హంతకుడు.. మగాళ్లే టార్గెట్.. 33 మందిని దారుణంగా.. )
హైగెనస్, లీలమ్మ దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. హైగెనస్ కుటుంబం దుబాయ్‌లోని జెడ్డాలో ఉంటోంది. అతడు ఓ పెద్ద కంపెనీలో పెద్ద పోస్టులోనే ఉన్నాడు. సంవత్సరానికి 10 లక్షల జీతం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఒడి దుడుకులు లేకుండా వారి జీవితం సాగిపోతోంది. కొడుకు అభిషేక్ కంటే కూతురు అనలియా అంటే హైగెనస్‌కు ఎంతో ప్రేమ. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. తనకు సంబంధించిన అన్ని విషయాలు ఆయనతో పంచుకునేది. ఆయన కూడా కూతురికి ఏలోటూ లేకుండా చూసుకునేవాడు.
అనలియా కేరళలో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జెడ్డాలోని జెడ్డా నేషనల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుండేది. ఇలాంటి సమయంలో తండ్రి ఆమెకు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. తన పెళ్లి విషయంలో తండ్రికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది అనలియా. ‘‘ నాన్న నీకు నచ్చిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటా’’ అంటూ ఉండేది. కూతురికి మంచి సంబంధం తీసుకురావాలని చాలానే కష్టపడ్డాడు. చివరకు ఓ మాట్రిమోనియల్ సైట్‌లో జస్టిన్ అనే యువకుడి ప్రొఫైల్‌ను చూశాడు హైగెనస్. అబ్బాయి బాగున్నాడు. పైగా దుబాయ్‌లోనే పని చేస్తున్నాడు. కూతురు దగ్గరగా ఉంటుంది అని పెళ్లికి అన్నీ ఏర్పాట్లు చేసేశాడు.
డిసెంబర్ 26, 2016
అనలియా జీవితంలో పెనుమార్పు మొదలవ్వబోతున్న రోజు.. అనలియా, జస్టిన్‌కు అంగరంగ వైభవంగా పెళ్లయింది. పెళ్లయిన కొన్ని రోజులకు అనలియా జెడ్డాలో నర్సు జాబ్‌కు రాజీనామా ఇచ్చి, దుబాయ్‌లోని భర్త దగ్గరకు వెళ్లింది. అనలియా అక్కడకు వెళ్లిన వెంటనే ఆమెను నర్సు ఉద్యోగంలో చేర్పించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు జస్టిన్. అయితే, ఆమెకు నర్సుగా పనిచేయటం ఇష్టం లేదు. నర్సింగ్ కాలేజీలో లెక్షరర్‌గా పనిచేయటం అంటేనే ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు ఈ విషయాన్ని జస్టిన్‌కు చెప్పింది. అతడు ఓకే చెప్పాడు. కానీ, పెళ్లి తర్వాత మాత్రం జాబ్‌లో చేరారని ఒత్తిడి చేయసాగాడు. ఆమె కూడా భర్త మాటకు ఎదురు చెప్పలేకపోయింది. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం కోసం ప్రయత్నించగా.. అనలియా అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ( సినిమాను తలపించే సీన్.. పట్టపగలు నడిరోడ్డులో మహిళపై దారుణం! )
ఆమె సర్టిఫికేట్లతో సమస్య ఉందని తెలిసింది. భార్యను ఈ విషయం గురించి అడిగాడు. తాను జెడ్డాలో ఓ నర్సింగ్ పరీక్ష రాయాల్సి ఉందని, అది రాస్తే నర్సు జాబ్ వస్తుందని చెప్పింది. జస్టిన్ ఆ మాటల్ని పట్టించుకోలేదు. వెంటనే కేరళలోని తల్లికి ఫోన్ చేసి, అనలియా నర్సింగ్ సర్టిఫికేట్లు ఫేక్‌వని చెప్పాడు. ఇక అప్పటినుంచి ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. పెళ్లికాక ముందు తన మీద ఎంతో ప్రేమ చూపించిన జస్టిన్ ఇప్పుడు వేరేలా ప్రవర్తిస్తున్నాడు. మరోవైపు అత్త సూటిపోటి మాటలతో నరకం అనుభవిస్తోంది అనలియా. అలా ఆమె కష్టాలు కొనసాగుతున్నా, అనలియా తన తండ్రికి ఈ విషయాలు ఏవి చెప్పకుండా వచ్చింది.
2017 సంవత్సరం..
ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం తెచ్చుకోవటం కారణంగా జస్టిన్‌ను జాబ్‌నుంచి తీసేశారు. ఇక అక్కడే ఉంటే అరెస్ట్ తప్పదని భావించి మే నెలలో భార్యని వెంటబెట్టుకుని కేరళలోని త్రిస్సూర్‌కు వచ్చాడు. జస్టిన్, అనలియా కేరళలో ఉండటానికి హైగెనస్ ఎంతో సహాయం చేశాడు. రోజులు గడుస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువవసాగాయి. జస్టిన్ చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పేవాడు. జస్టిన్‌కు అతడి బంధువైన ఓ అమ్మాయితో సంబంధం కూడా ఉండేది. ఈ విషయంలోనూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఓసారి అనలియాకు పిచ్చి పట్టిందంటూ మెంటల్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడు.
2018, జనవరి 2
ఈ బాధల మధ్యే అనలియా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి ప్రేమను కూడా ఆమె పూర్తిగా అనుభవించలేకపోయింది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఓ సారి అనలియాపై అతడు చెయ్యి చేసుకున్నాడు. మరుసటి రోజు వారి ఇంటికి వెళ్లిన అభిషేక్‌కు అక్క ముఖంపై దెబ్బలు కనిపించాయి. దానికి కారణం బావ జస్టిన్ అని తెలిసి నిలదీశాడు. అభిషేక్‌కు అక్క అంటే ప్రాణం. అక్క ఒంటి మీద గాయాలు చూసే సరికి అభిషేక్‌కు పూనకం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఏకంగా జస్టిన్ కి వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి వెళ్ళింది. అప్పుడు అభిషేక్ కోపానికి వణికిపోయిన జస్టిన్.. అతను బయటకి వెళ్ళాక మాత్రం అనలియాపై మరోసారి చేయి చేసుకున్నాడు, నీ తమ్ముడికి ఎంత దైర్యం? నా మీదకే వస్తాడా అంటూ.. మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇలా జస్టిన్ ప్రతి రోజు అనలియాని టార్చర్ పెట్టేవాడు. ( అప్పుడు అత్యాచారం చేశాడని కేసు పెట్టింది.. ఇప్పుడేమో బెయిల్ ఇవ్వమని వేడుకోలు! )
కూతురు కష్టాలు పడుతున్న విషయం తండ్రి హైగెనస్ ఆలస్యంగా తెలిసింది. అంతే.. బిడ్డని తలుచుకుని ఆయన బోరుమన్నాడు. వెంటనే అనలియా చేత 2018 ఏప్రిల్ నెలలో కదవంతర పోలీస్ స్టేషన్‌లో ఓ కంప్లైంట్ ఇప్పించాడు. తర్వాత హైగెనస్ సోదరులు వెళ్లి జస్టిన్‌ను గట్టిగా నిలదీశారు. ఆ క్షణంలో జస్టిన్ తనది తప్పు అయిపోయింది, ఇకపై ఇలా జరగదు అని మాట ఇవ్వడంతో అనలియా కంప్లైంట్ వెనక్కి తీసుకుంది. కానీ.., అత్తింటి నుంచి విముక్తి లభించాలంటే తాను చదువుకోవటమే మార్గం అనుకుందామె. భర్తను ఒప్పించి బెంగళూరులో ఎమ్మెసీ చేరింది. 2018, ఆగస్టు 4న బెంగళూరుకు వెళ్లింది. బెంగళూరు వెళ్లిన తర్వాత ఆమెనుంచి ఏడు నెలల బిడ్డను దూరం చేయటం మొదలుపెట్టారు. వీడియో కాల్‌లో కూడా బాబును చూడనిచ్చేవారు కాదు.
తల్లి ప్రేమ కదా? అనలియా తల్లడిల్లిపోయింది. నాన్న.. నాకు నా బిడ్డను చూడాలి అనిపిస్తోంది అంటూ.. హైగెనస్ కి ఫోన్ చేసింది. నేరుగా ఇంటికి రా. నీ బిడ్డని చూడకుండా.. నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తా అంటూ హైగెనస్ కూతురికి దైర్యం చెప్పాడు. ఆగస్టు 23న త్రిస్సూర్‌కు వచ్చిందామె. కొడుకును చూసుకుంది. మామ దెబ్బకి భయపడి.. జస్టిన్, అతని తల్లి కూడా మౌనంగా ఉండిపోయారు. బిడ్డని తనివీరా ముద్దాడింది అనలియా. ఓ రోజు అంతా తన బాబుతో గడిపి.. ఆగస్టు 27న మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోవాలని రిటర్న్ టిక్కెట్ బుక్ చేసుకుంది. ఇక ఆగస్టు 24న ఫోన్ చేసి.. రేపు బెంగళూరు వెళ్లిపోతున్నట్లు తండ్రికి చెప్పింది. తండ్రి మనసు ఏదో కీడు శంకించింది. అదే సమయంలో అనలియా మనసులో కూడా ఏదో అలజడి. దైర్యం కోసం ఆగస్టు 25న తమ్ముడు అభిషేక్‌తో వాట్సాప్ చాట్ చేసింది. తనకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అతడికి చెప్పుకుని బాధపడింది. ఈ సంఘటనల తరువాత
2018, ఆగస్టు 25వ తేదీ మధ్యహ్నం త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమె కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత పెరియార్ నదిలో శవమై తేలింది..
శవాన్ని గుర్తించటానికి జస్టిన్ వెళ్లలేదు. వెడ్డింగ్ రింగ్‌ను తీసేశాడు. ఆఖరికి అనలియా అంత్యక్రియలకు సైతం అతడు హాజరు కాలేదు. తల్లి ఆఖరి చూపులకోసం ఆమె బిడ్డను కూడా పంపలేదు. అంత్యక్రియలు జరుగుతున్నపుడు జస్టిన్ బంధువైన ఫాదర్ పివిన్ అక్కడకు వచ్చాడు. జస్టిన్‌కు వ్యతిరేకంగా కేసుపెడితే నష్టపోతారంటూ బెదిరించాడు. తన బిడ్డ చావుకు జస్టిన్ కుటుంబమే కారణమంటూ అంత్యక్రియ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నాడు హైగనస్. తన కూతురు చావుకు కారణం ఏంటని అన్వేషించసాగాడు.
ఆ డైరీలో ఉన్నవి అక్షరాలు కాదు.. కూతురి కన్నీళ్లు..
అనలియా మరణించి మూడు వారాలు గడిచింది. కొచ్చిలోని వారింట్లోని ఫ్లవర్ వాజ్‌లో ఓ కీ దొరికింది. ఆ కీ అనలియాకు సంబంధించిన కప్‌బోర్డుది. వాళ్లు కప్‌బోర్డు తెరిచి చూశారు. అక్కడో డైరీ లాంటిది దొరికింది. ఆ డైరీలో ఇలా రాసి ఉంది.
‘‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా ఎన్నో కలలు కన్నాను. జస్టిన్ నాకు తగ్గ జోడీ అనుకున్నాను. అతడు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. నా ఆశలు తీరుస్తాడని అనుకున్నాను. అవన్నీ కల్లలయ్యాయి. పెళ్లయిన తర్వాత దుబాయ్ నుంచి కేరళలోన అత్తారింటికి వచ్చాను. జస్టిన్ నా ఖర్చుల కోసం కనీసం రూ. 100 కూడా ఇచ్చేవాడు కాదు. నేను అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నా. నేను ముందు చూసిన జస్టిన్ వేరు.. తర్వాత జస్టిన్ వేరు. పెళ్లికి ముందు నేను అతడితో మాట్లాడినపుడు.. ‘‘ఇతడికంటే నాకు మంచి వాడు ఈ ప్రపంచంలోనే దొరకడు’’ అనుకున్నా.. ఇప్పుడు నా జీవితంలో కేవలం విషాదం మాత్రమే మిగిలింది. నా జీవితంతో అలసిపోయాను.. అలసిపోయాను.. నా బాధలు పంచుకోవటానికి ఎవరూ లేరు. ఎంతో రాయాలని ఉంది. కానీ, రాయలేకపోతున్నా. నేను కేవలం నా కుమారుడి కోసం బతుకుతున్నాను. నా దురదృష్టం నేను కలల కన్న జీవితాన్ని పొందలేకపోయాను. నా భర్త అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తాడని అనుకుంటున్నా. కానీ, నేను చూపించినంత ప్రేమ అతడు చూపించలేకపోతున్నాడు. నా అత్త ఓ శాడిస్ట్.. మాటలతో, ప్రశ్నలతో నన్ను హింసించేది. నాకు ఏదైనా అయితే.. నా జీవితంలో ఏం జరిగింది. నా పెళ్లి తర్వాత ప్రతిరోజు నేను ఏం అనుభవించాను అన్న వాస్తవాలను ఎవ్వరూ బయటపెట్టలేరు’’ అంటూ బాధపడింది.
కడుపులో ఉన్న బిడ్డకో లేఖ:
అనలియా తన బాధలను ఎప్పటికప్పుడు ఆ డైరీలో రాసుకుంటూ ఉండేది. ఆమె తొమ్మిదొవ నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా పుట్టబోయే బిడ్డకి ఒక లేఖ రాసుకుంది.
‘‘ప్రియమైన నా బిడ్డకు.. నేను ఇప్పుడు తొమ్మిది నెలల గర్భంతో ఉన్నాను. మరికొన్ని రోజుల్లో నువ్వు బయటకి వస్తావు. ప్రతీ తల్లి తన బిడ్డ కోసం ఎన్నోకలలు కంటుంది. కానీ, నేను నా బిడ్డకు ఏమీ చేయలేని ఓ నిస్సహాయ తల్లిని. నేను ఈ ప్రపంచంలో లేకపోతే… నువ్వేం బాధపడకు.. దేవుడు నీ కోసం ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటాడు. నేను మాత్రం ఈ ప్రపంచం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచం నన్ను ఎంతో బాధ పెట్టింది. నేను గనుక వీలైనంత తొందరగా బయటపడకపోతే నువ్వు కూడా అంధకారంలో పడతావు. నాకు తెలుసు నా తల్లిదండ్రులు నీ బాగోగులు చూసుకుంటారు’’ అంటూ తాను అనుభవించిన బాధను కడుపుతో ఉన్నపుడే డైరీలో రాసుకుంది. ( మూడు పెళ్లిళ్లు చేసుకుని మరో మహిళతో భర్త ప్రేమాయణం.. మూడో భార్య ఊహించని నిర్ణయం! )
ఆ డైరీ చదివిన హైగెనస్ అక్కడే కుప్పకూలిపోయాడు. తన కూతురు పెళ్లి అయిన నాటి నుండి ఎంతటి నరకం అనుభవించిందో ప్రతి అక్షరంలో అతనికి కనిపించింది. నేనే నా కూతురి జీవితాన్ని నాశనం చేశానంటూ గుండెలు పగిలేలా రోదించాడు. ఆ క్షణమే హైగెనస్ తన కూతురి ఆత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాడు. ఆమె చావుకి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు.
డైరీ ఆధారంగా పోలీసులకు కంప్లైంట్ చేశాడు హైగెనస్. గృహ హింస కేసు నమోదు చేశారు పోలీసులు. తన కూతురికి న్యాయం జరగాలన్న ఉద్ధేశ్యంతో జెడ్డాలో ఉద్యోగం మానేసి కేరళకు వచ్చేశాడు. తన బాధను సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించాడు. ఈ నేపథ్యంలో జస్టిన్ కోర్టులో సరెండర్ అయ్యాడు. ప్రస్తుతం అనలియా బిడ్డ జస్టిన్ కుటుంబంతోనే ఉంటున్నాడు. ఆ బిడ్డను ఇవ్వమని హైగెనస్ ఎంత బ్రతిమాలినా వాళ్లు ఇవ్వలేదు. హైగెనస్ మాత్రం పోయిన తన బిడ్డ ఆత్మ శాంతి కోసం, బతికి ఉన్న ఆమె బిడ్డ కోసం న్యాయపోరాటం చేస్తానే ఉన్నాడు.
కానీ.., కోర్టులు మాత్రం సాక్ష్యాలు కావాలంటున్నాయి. అనలియా కన్నీరుతో ముందుగానే రాసి పెట్టుకున్న డైరీ.. కేసుని ఇన్ని రోజులు నిబెట్టగలిగింది కానీ.., జస్టిన్ కి శిక్ష మాత్రం వేపించలేకపోయింది. కానీ.., హైగెనస్ ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. నాలుగు గోడల మధ్య అనలియా పడ్డ నరకానికి సాక్ష్యాలు ఎక్కడ నుండి తేవాలి? ఆ తండ్రి దగ్గర సమాధానం లేదు. కానీ.. అతను మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఇది విధి ఆడిన జాలి లేని ఆటలో బలైన అనలియా, ఆమె చావుకు కారణం తానేని కుమిళిపోతున్న హైగెనస్ కన్నీటి కథ. మరి.. ఈ మొత్తం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహిళా వాలంటీర్ దారుణ హత్య.. ఇనుపరాడ్డుతో కొట్టి ఆపై!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.