ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. కూతురు కులం తక్కువ వాడిని ప్రేమించిందని, మతాంతర వివాహం చేసుకుందని, ప్రేమ పేరుతో పరువు తీస్తుందని ఇలాంటి కారణాలలో యువతి కుటుంబ సభ్యులు హత్యలకు తెగబడుతున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నారని మొన్న సరూర్నగర్లో, నిన్న బేగంబజార్లో ఇద్దరు యువకులను హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది. తనను ప్రేమించట్లేదని అక్కసుతో పట్టపగలే, నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కంచన్బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హఫీజ్ నగర్ పరిధిలోని ఓ యువతిని హబీబ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను ప్రేమించాలని గత కొంతకాలం నుంచి ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. హబీబ్ ప్రేమను ఆమె తిరస్కరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవాళ మధ్యాహ్నం కంచన్బాగ్ పీఎస్ పరిధిలోని ఒమర్ హోటల్ వద్ద యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె వెనుకాలే వచ్చిన హబీబ్ థన్ వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని విచక్షణారహితంగా పొడిచాడు. మెడ, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం యువకుడు అక్కడినుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.