ప్రముఖ తమిళ నటికి చేదు అనుభవం ఎదురయ్యింది. నమ్మకంగా పని చేసినట్లు నటిస్తూ.. ఆమె ఇంటికే కన్నం వేశాడు సదరు నటి ఇంట్లో పని చేసే ఓ కుర్రాడు. దీని గురించి నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ తమిళ నటి నిక్కీ గల్రాణికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది.
ఆ వివరాలు.. నిక్కీ గల్రాణి స్థానిక రాయపేటలో నివాసం ఉంటున్నారు. నెల క్రితం కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన ధనుష్ (19) అనే యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరాడు. ఈనెల 11న నటి ఇంట్లో రూ.1.25 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు తెలిసింది. దీని గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారించగా.. నటి ఇంట్లో కొత్తగా పనిలో చేరిన ధనుష్.. ఈ దొంగతనం చేశాడని గుర్తించారు. ఈ క్రమంలో అన్నాశాల పోలీసులు బుధవారం ధనుష్ ని అరెస్ట్ చేశారు.