ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. జోవో జారీ చేసిన నాటి నుంచి రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. మల్టీప్లెక్స్, నగరాల్లో ఉన్న థియేటర్లకు నిర్ణయించిన టికెట్ ధరలు పర్వాలేదు అనేలా ఉన్నప్పటికి.. గ్రామాలు, చిన్న టౌన్ లకు వచ్చే సరికి మరీ తీసికట్టు రేట్లను నిర్ణయించిందని ఇండస్ట్రీ వాళ్లు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఇండస్ట్రీ నుండి కిరాణ కొట్టు లాంటి వ్యాఖ్యలు రావడం, దానికి ప్రభుత్వం నుండి అదే స్థాయిలో కౌంటర్లు పడటంతో అసలు సమస్య పక్కదారి పట్టింది. ఇలా గత కొన్ని రోజులుగా వ్యంగ్య వ్యాఖ్యలతో కొనసాగుతున్న ఈ వివాదం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రవేశంతో కొత్త మలుపు తీసుకుంది. ప్రభుత్వానికి పది ప్రశ్నల పేరుతో వర్మ రిలీజ్ చేసిన వీడియో అర్ధవంతంగా ఉండటంతో ఇప్పుడు సమస్యపై ఆరోగ్యకరమైన చర్చ మొదలయింది.
ఏ అంశం మీదనైనా తనదైన శైలిలో స్పందిస్తూ.. రాంగ్ గోపాల్ వర్మగా ముద్ర పడ్డ ఆర్జీవీ.. సినిమా టికెట్ల ధరల విషయంలో మాత్రం చాలా ఆలోచనాత్మకంగా స్పందించారు. అప్పటి వరకు ఓ కిరాణ కొట్టు పంచాయతీగా సాగుతున్న వ్యవహారం.. వర్మ ఎంట్రీతో ఆరోగ్యకరమైన మలుపు తీసుకుంది. ఈ సమస్యపై ఇటు ఆర్జీవీ, అటూ ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మధ్య చోటు చేసుకున్న ట్విటర్ సంభాషణ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. జనాలకు కూడా అసలు సమస్య ఏంటో ఇప్పుడే అర్థం అవుతోంది. వర్మ పాయింట్ టూ పాయింట్ లాజికల్ గా ప్రశ్నలు వేయడం, దానికి పేర్ని నాని కూడా అంతే పద్దతిగా వివరణాత్మకంగా జవాబులు చెప్పడం విశేషం.
ఇది కూడా చదవండి : మంత్రి పేర్ని నానికి సవాల్ విసిరిన వర్మ.. నెట్టింట ట్వీట్ వైరల్!
పేర్ని నాని ప్రశ్నలు
ఇక ఆర్జీవీ వీడియోలో అడిగిన అంశాలపై మంత్రి పేర్ని నాని పలు ప్రశ్నలు సంధించారు. మాములుగా ఉండే టికెట్ రేటును థియేటర్లు ఎంత పెంచుతున్నాయి.. అసలు అంత భారీ మొత్తం నిర్ణయించడం కరెక్టేనా.. అసలు టికెట్ ధరలను ఇంత భారీగా పెంచడం వెనక ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.. వినియోగదారుడిని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని పేర్ని నాని కోరారు. ప్రస్తుతం ఇరువురి మధ్య ఆరోగ్యకరమైన చర్చ నడుస్తుండటంతో.. సామాన్యులు కూడా ఈ అంశంపై ఆసక్తి కనబరుస్తున్నారు.<
ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు https://t.co/eGEbF3LaLN
— Perni Nani (@perni_nani) January 5, 2022
/p>
ఆర్జీవీ సమాధానాలు
ఆర్జీవీ సంధించిన కొన్ని ప్రశ్నలు ప్రభుత్వంతో పాటు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. డిమాండ్- సప్లై సిద్దాంతం, ముడి సరకు-దాని బ్రాండింగ్ కోసం అయ్యే ఖర్చు, వస్తువు నాణ్యత, టికెట్ కొనేవాడు.. దాన్ని అమ్మే వాడి మధ్యలో జరిగే లావాదేవీల్లో ప్రభుత్వ ప్రమేయం ఏ మేర ఉండాలో.. చిన్న సినిమా, పెద్ద సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు వంటి అంశాల గురించి వివరిస్తూనే.. థియేటర్ అంటే వినోద సేవలందించే ప్రాంగణం కాదు.. ఫక్తు వ్యాపారం జరిగే చోటు.. అక్కడ ఉండే ధోరణి.. వాటితో ప్రజలకున్న అవసరం.. దాని ఆధారంగా జరిగే వ్యాపారం గురించి ఆర్జీవి తన సమాధానాల్లో చక్కగా విశ్లేషించారు.
Super @RGVzoomin garu 👌@perni_nani https://t.co/llEw3tZgtp
— TharunKumar Palacholla (@TharunKP_) January 5, 2022
ఇది కూడా చదవండి : AP Cinema Ticket Price Issue: మంత్రి పేర్ని నానిని కలిసిన ఆర్. నారాయణ మూర్తి!
సమస్య పరిష్కరానికి ఇదే తొలి ప్రయత్నం కానుందా..
ప్రారంభంలో ఈ సమస్యపై ఎవరు సరిగా స్పందించలేదు. ముఖ్యంగా నిర్మాతల మండలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో కొందరు హీరోలు, నిర్మాతలు మాట్లాడినప్పటికి.. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. పైగా నిర్మాతల మండలి ఈ సమస్యపై ఆయా వ్యక్తులు వెల్లడించే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం.. మాకు సంబంధం లేదని తెలిపింది. అటు మెగస్టార్ చిరంజీవి కూడా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ చర్యలని సమర్ధిస్తూనే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రేట్లపై పునరాలోచించాల్సిందిగా కోరారు.
అటు ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల రేట్ల వివాదంలో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఓ కమిటీని వేసింది. అయితే ఇండస్ట్రీ నుంచి ఎవరికి వారు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు కానీ.. అసలు సమస్య ఇది.. దీనిపై అభ్యంతరాలు ఇవి అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు దీనిపై స్పందించి.. సరైన సలహాలు చెప్పి.. సమస్యకు పరిష్కారం దిశగా కృషి చేయాలని కోరారు. అటు ప్రభుత్వం కూడా మీ సమస్యలు చెప్పండి.. చర్చిద్దాం.. సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్తోంది.
ధన్యవాదములు @RGVzoomin గారు 💐. తప్పకుండ త్వరలో కలుద్దాం https://t.co/ZLZZ0hcBkS
— Perni Nani (@perni_nani) January 5, 2022
రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగడంతో ఇప్పుడు అసలు సమస్య మీద చర్చ మొదలయింది. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందో అందరికీ తెలిసి వచ్చింది. దీని మీద సినీ వర్గాలు ఉమ్మడిగా చర్చించుకుని, ప్రభుత్వానికి తమ కష్టాన్ని చెప్పుకోగలిగితే మాత్రం కచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరకొచ్చు. ఇందుకు రామ్ గోపాల్ వర్మ అయితే గేట్లు ఓపెన్ చేశారు. ఇక ఇండస్ట్రీ పెద్దలు ఆ మార్గంలో ప్రయాణిస్తారా? లేదా? అన్నదే చూడాలి. ఏదేమైనా.. సినిమా టికెట్స్ రేట్ల విషయంలో రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించిన విధానం, అందుకు ప్రభుత్వం స్పందించిన విధానం మాత్రం రాష్ట్రంలో చాలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : కొడాలి నానికి రామ్ గోపాల్ వర్మ కౌంటర్!