ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదంపై సినీ ప్రముఖులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజమౌళి మాట్లాడుతూ ‘‘పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ ఓర్పుగా విన్నారు. అన్నింటికి పరిష్కార మార్గం చూపే దిశగా ఆయన చొరవ తీసుకున్నారు. కొన్నాళ్లుగా సందిగ్థంలో ఉన్న ఈ విషయంపై పరిష్కారం దిశగా చిరంజీవి ముందుకు తీసుకుళ్లారు. పరిశ్రమ పెద్ద అని అంటే ఆయనకు నచ్చదు కానీ ఆయన పరిశ్రమ కోసం చేసే పనుల వల్ల ఆయన పెద్దరికం తెలుస్తోంది. ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యం కారణంగా ఇంత పెద్ద సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయగలిగారు’’ అని తెలిపారు.
మేమంతా రిలాక్స్‌గా ఉన్నాం: మహేష్ బాబు
గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో సందిగ్ధం నెలకొంది. అలాంటి సమయంలో చిరంజీవి ముందడుగు వేసి జగన్‌గారిని కలిసి మాకు దారి చూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. ఈరోజు జరిగిన సమావేశంతో మేమంతా చాలా రిలాక్స్‌గా ఉన్నాం. వారం, పది రోజుల్లో శుభవార్త వింటాం. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీఎం జగన్‌కు, మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని మహేశ్ బాబు అన్నారు.
‘సీఎం జగన్ గారు మా పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆయనకు, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న చిరంజీవిగారికి ధన్యవాదాలు’ అన్నారు ప్రభాస్.