ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ముఖ్యంగా పుష్ప సినిమాలోని సాంగ్స్, డైలాగ్ లను సామాన్యుల నుండి నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు ‘తగ్గేదేలే‘.. అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. సినిమాకు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అందులో చూపించిన ఎర్రచందనం స్మగ్లింగ్ మరో ఎత్తు. పోలీసుల కంట పడకుండా దుంగలను నీటిలోకి(రిజర్వాయర్) నెట్టేస్తారు. ఆ ఆ తరువాత అధికారికి ముడుపులిచ్చి గేట్లు మూయించేస్తాడు. ఈ మొత్తం సీన్ సినిమాకే హైలెట్. అచ్చం.. ఇలాంటి సీన్ నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పోర్ర్తీ వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉన్న సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం ఎక్కవ భాగం వైఎస్సార్ జిల్లాలో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 48 చదరపు కి.మీ విస్తరించి ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియా ఎర్రచందనం చెట్లకి కేంద్ర బిందువు. మంచి నాణ్యత కలిగిన దుంగలు ఇక్కడ లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. దీనికితోడు లోతట్టు ప్రాంతం కావడంతో రవాణా మార్గానికి అనువుగా ఉండదు. దీంతో అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఆ వైపు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వీడియో: బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఉత్తకాళ్లతో నడిచి వెళ్లిన ఎమ్మెల్యే
సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతంలో చేపలు పట్టే జాలర్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటూ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. స్మగ్లర్లు కొందరు జాలర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా పడవలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అలాగే తమిళ కూలీలను కూడా ఇదే పద్ధతిలో చేర్చి ఎర్రచందనం చెట్లను నరికిస్తున్నట్లు తెలుస్తోంది. నరికిన దుంగలను రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాల్లోని నీటిలో నిల్వ ఉంచుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసినా కనిపించని విధంగా నీటిలో డంపింగ్ చేస్తారట. ఇలా విలువైన సంపద తరలిపోతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదనే విమర్శలొస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘‘జోకర్’’ వేషంలో నర హంతకుడు.. మగాళ్లే టార్గెట్.. 33 మందిని దారుణంగా..