తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాన్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.లక్ష సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల చెక్ అందిస్తూ వస్తున్నారు.
ఈ మేరకు అనంతపురం జిల్లాలో ఈ యాత్రను పవన్ ఇటీవలే ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రను శనివారం ప్రారంభిచారు. జానంపేట గ్రామంలో ఇటీవల పంట నష్టం వచ్చి అప్పుల బాధ భరించలేక మల్లిఖార్జున రావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం దిక్కతోచని పరిస్థితిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందచేశారు. అంతేకాదు ఈ సాయంతోపాటు ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భూమిని నమ్ముకొని రైతు పంట పండిచే క్రమంలో నష్టాలు వారిని వెంటాడుతున్నాయి. అయినా కూడా రైతు భూమినే నమ్ముకుంటున్నాడు. అదే సమయంలో కొంత మంది ఆర్ధికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారందరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.