భారత దేశంలో అన్ని రకాల మతాలు, కులాల వారు జీవిస్తున్నారు. ఎవరి సాంప్రదాయాలు వారివి.. ఎవరి మత విశ్వాసాలు వారివి. అందరూ ఒకే చోట ఉండటం వల్ల కలిసి మెలిసి ఉంటారు. కొంత మంది హిందూ ముస్లిం అంటూ మత విద్వేశాలతో రెచ్చగొట్టినా చివరికి హిందూ ముస్లిం అన్నదమ్ములం అంటూ కలిసిపోతుంటారు. సాధారణంగా హిందువులు ఉగాది పర్వదినం రోజున తమకు అంతా మంచి జరగాలని దేవాలయాలకు వెళ్తుంటారు.
ప్రతి ఉగాది పండుగరోజున ముస్లింలు వెంకటేశ్వరస్వామిని దర్శించడం ఒక్క కడప జిల్లాలోనే చూస్తాం. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అనాధిగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. వందలాది మంది ముస్లింలు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు.
ఇక్కడకు ప్రత్యేకంగా ముస్లింలు ఎందుకు వచ్చి పూజలు చేస్తారన్న విషయం గురించి ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వరస్వామి అప్పట్లో ముస్లిం మతానికి చెందిన బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నాడని.. ఈ కారణంతో స్వామి వారు తమ ఇంటి అల్లుడిగా భావిస్తారని అన్నారు. ప్రతి ఉగాదికి స్వామివారిని దర్శించుకోవడం వల్ల తాము ఎంతో సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉంటామని అంటున్నారు ముస్లిం భక్తులు.