రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. కక్షలతో రగిలిపోయే రెండు కుటుంబాలు స్నేహంగా మారాయి. పరిటాల శ్రీరామ్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి కౌగలించుకున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకోగా అక్కడికి వచ్చిన శ్రీరామ్‌ను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు.. మాట్లాడుకున్నారు. ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకున్నారు. అయితే ఈ అపురూప దృశ్యం చూసి చూసిన రాయలసీమ జనం కొంతమంది షాక్ అవుతుంటే మరికొంతమంది మురిసిపోతున్నారు. ఎన్నాళ్టికి ఇటువంటి సన్నివేశం చూస్తున్నాం అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు.
అనంతపురం రాజకీయాల్లో జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబాల మధ్య వైరం ఇప్పటిది కాదు.. ఉప్పునిప్పులా ఉంటాయి ఆ రెండు కుంటుంబాలు. వారి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మంటుంది. ఒకప్పుడు జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, పరిటాల ఫ్యామిలీ తెలుగుదేశం ఉంది. ఆ సమయంలో రాజకీయంగా ఈ రెండు కుటుంబాల మద్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవి. వైఎస్సార్ మరణం తర్వాత తెలుగు రాష్ట్రల విభజన అయ్యింది. దాంతో టీడీపీ కండువ కప్పుకున్నారు జేసీ బ్రదర్స్. ఆ సమయంలో పరిటాల కుటుంబం జేసీ బ్రదర్స్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించింది. కాకపోతే పార్టీ అధినేత జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇదిలా ఉంటే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అనంతలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా వైసీపీని దెబ్బతీసేందుకు ఆగర్భ శత్రువులైన జేసీ-పరిటాల కుటుంబాలు శత్రుత్వం వదిలి మిత్రులుగా మారినట్లు తెలుస్తుంది.
పరిటాల- జేసీ వర్గీయుల మధ్య విభేదాలు తగ్గిపోతే జిల్లాలో తమకు తిరుగు ఉండదని టీడీపీ కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. అనంతలో గట్టి పట్టు ఉన్న ఈ రెండు కుటుంబాలు ఏకమయ్యాయంటే వచ్చే ఎన్నికల్లో అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని, జగన్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్ ఆలింగనం చేసుకున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీన్ ఇప్పుడు అనంత పాలిటిక్స్‌లో హాట్‌టాఫిగా మారింది.. పరిటాల, జేసీ ఫ్యామిలీ ఓకే వేదిక మీదకు రావడం శుభపరిణామం అంటున్నారు ఇరు కుటుంబ అభిమానులు. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్మురేపుతున్నాయి.