దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకీ దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇవి కొన్ని సార్లు ప్రమాదంగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవడంతో విషాదాలు నెలకొంటున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. కానీ ఆ బైక్ మృత్యురూపంలో వెంటాడుతుందని ఊహించలేదు. మరుసటి రోజు చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలి.. ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
శివకుమార్ కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్ కి ఇంట్లోని బెడ్ రూమ్‌లో చార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున బ్యాటరీ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇల్లు మొత్తం వ్యాపించాయి. శివకుమార్‌తో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకొని భయంతో కేకలు వేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే తలుపు బద్దలు కొట్టి వారిని బయటకు తీసుకు వచ్చారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వాళ్లను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో శివకుమార్ మరణించాడు.
తీవ్రంగా గాయపడ్డా శివకుమార్ భార్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శివకుమార్ ఇద్దరు పిల్లలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ చార్జింగ్ చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంఘటనలు బట్టి తెలుస్తుంది.