తన కోపమే తనకి శత్రువు అన్నారు పెద్దలు. విజయవాడ, కృష్ణలంకలోని తారక రామ నగర్‌లో నివసిస్తున్న 28 ఏళ్ల నందిని అనే యువతి విషయంలో ఇప్పుడు ఈ మాటే నిజం అయ్యింది. ఆర్టీసీ బస్ తన స్కూటీకి డాష్ ఇచ్చిందనే కారణంతో.. బస్సులోకి ఎక్కి, డ్రైవర్ పై ఓ మహిళ దాడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు మహిళపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడమే కాక.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కూడా మహిళ చేసిన పనిని కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. దీంతో.., ఇప్పుడు అంతా ఊహించినట్టే విజయవాడ పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు.
డ్యూటీలో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ, దాడి చేసిన నందినిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు అయ్యింది. అయితే.. సదురు యువతిని రిమాండ్ కి పంపకుండా, సెక్షన్ 41 ద్వారా స్టేషన్ బెయిల్ ఇచ్చి, అబ్జర్వేషన్ లో మాత్రమే ఉంచారు. ఒకవేళ కోర్టు వాదనలలో నందిని తప్పు చేసినట్టు తేలితే మాత్రం ఆమెకి మూడేళ్ళ వరకు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపల నందిని కేసులోని సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినా.., స్టేషన్ బెయిల్ రూల్స్ అతిక్రమించినా ఆమెను ఏ క్షణమైనా రిమాండ్ కి పంపవచ్చని సమాచారం.గతంలో ఏం జరిగిందంటే..
విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం(ఫిబ్రవరి 10) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బస్సు తీసుకొని ప్రకాశం రోడ్డులో వెళ్తున్నాడు. ఆ సమయంలో నందిని అనే మహిళ స్కూటీ మీద వెళ్తూ బస్సుకు అడ్డొచ్చింది. దాంతో ముసలయ్య సడెన్ బ్రేక్ వేయగా.. బస్సు మహిళ సమీపంలోకి వెళ్లి ఆగింది. ఈ క్రమంలో బస్సు.. సదరు మహిళ స్కూటీకి చిన్న డాష్ ఇచ్చింది. ఈ చర్యతో ఆగ్రహించిన మహిళ.. డ్రైవర్‌పై అరుస్తూ.. బస్సు లోపలికి వెళ్లింది. ఇంజన్ మీదకు ఎక్కి మరీ డ్రైవర్ పై దాడి చేసింది. అతడి చెంప మీద కొట్టడమే కాక.. చొక్కా చింపి.. కాలితో తన్ని వీరంగం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ని.. సదరు మహిళను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. డ్రైవర్ ఫిర్యాదుతో మహిళపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి ఇప్పుడు నందినిపై సెక్షన్ 353 ప్రయోగించారు. మరి.. ఈ విషయంలో నందినికి ఎలాంటి శిక్ష విదించాలని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.