కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరలు, థియేటర్లు మూతపడిన విషయం పై భారీ ఎత్తున వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. అటు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆందోళన చెందారు. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో ఏపీ టికెట్ రేట్లపై ఆయన ఆవేదన కూడా బయటపెట్టింది విదితమే. తాజాగా ఆర్.నారాయణమూర్తి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానీని కలిశారు. మంత్రి నానీతో మచిలీపట్నం క్యాంప్ ఆఫీసులో సమావేశమైన నారాయణమూర్తి కొన్ని విషయాలపై వ్యక్తిగతంగా మాట్లాడి.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని మాత్రమే కలిసినట్టు చెప్పారు.
ఇటీవలే ఆయన మాట్లాడుతూ.. సినిమా తీసేవాళ్లు, సినిమా చూపించేవాళ్లు, సినిమా చూసేవాళ్లు ముగ్గురూ బావుండాలి. ప్రస్తుతం ఏపీలోని పరిస్థితుల కారణంగా ధియేటర్లు మూత పడుతుండటంతో వందలాది కుటుంబాల పై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ బాగున్నప్పుడే సినిమా రంగం కళకళలాడుతుందని.. ఏమైనా సమస్యలుంటే ఏపీ ప్రభుత్వం పరిష్కరించాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. అయితే.. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఏపీ పెద్దలతో చర్చించేందుకు ఓ కమిటీ వేశామని, త్వరలోనే కలుస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆ కమిటీ ఎంతవరకు ముందుకు కదిలిందో తెలియాల్సి ఉంది. అది క్లారిటీ రాకముందే ఆర్.నారాయణమూర్తి నేరుగా మచిలీపట్నం వెళ్లి మంత్రి నానీని కలిశారు. అయితే.. ఈ సమావేశంలో ఇండస్ట్రీకి సంబంధించి విషయాలపై చర్చించామని, ముఖ్యంగా థియేటర్లు మూతపడకుండా చూడాలని నారాయణమూర్తి కోరినట్టు సమాచారం.