సినిమా టిక్కెట్ల ధరల వివాదానికి ముగింపు పలికేందుకు గాను చిరంజీవి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చర్చల్లో భాగంగా సీఎం జగన్ ఇండస్ట్రీని విశాఖకు తరలించాలని కోరాడు. ఇక్కడికి వస్తే.. స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వడమే కాక.. హీరోలకు కూడా స్థలం కేటాయిస్తానని.. అందరి సహకారంతో విశాఖను మరో జూబ్లీహిల్స్ గా మారుద్దామని సీఎం జగన్ తెలిపారు. ఇండస్ట్రీని విశాఖకు తరలిస్తే.. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సాయం చేస్తానని ప్రకటించారు. ఇక ముఖ్యంత్రి సూచన నేపథ్యంలో తాజాగా మరోసారి విశాఖలో సిని నిర్మాణానికి ఉన్న అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో విశాఖలోని పర్యాటక ప్రాంతాలు, గతంలో అక్కడ తెరకెక్కిన చిత్రాలు, ఎందువల్ల విశాఖలో సినిమాలు తీయడం లేదు వంటి తదితర వివరాలు..
ఓవైపు సాగర తీరం, మరోవైపు పచ్చని కొండలు, ఆలయాలు, బౌద్ధరామాలు, పోర్టులు, బీచ్ ల వంటి పర్యాటక ప్రదేశాలతో అలరారుతుంది విశాఖ. పరిపాలన రాజధానిగానే కాక.. సాగర తీరాన్ని సినిమా ఇండస్ట్రీకి హబ్ గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైజాగ్ కు షూటింగ్ లు, స్టూడియోలు కొత్త కాదు. కానీ హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ధి చెందలేదు. అయితే వైజాగ్ అందాలను 1960 ప్రాంతంలోనే గుర్తించారు అలనాటి దిగ్గజ దర్శకుడు బాలచందర్. చెన్నైలోని మెరినా బీచ్ ను కాదని.. విశాఖలోని ఆర్కే బీచ్ పైనే మనసు పారేసుకుని.. ఇక్కడే మరో చరిత్ర సినిమా తీసి.. ఓ కొత్త చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలు ఇక్కడ తెరకెక్కాయి. ఈతరం హీరోలు నటించిన పలు చిత్రాలు కూడా విశాఖలో తెరకెక్కాయి. ఈ మధ్య కాలంలో కొత్త సినిమా ప్రీరీలిజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్ లు విశాఖలోనే నిర్వహిస్తున్నారు.
స్వతంత్రం రాకముందే 85 ఏళ్ల క్రితమే వైజాగ్ లో స్టూడియో నిర్మించారు. 1930లోనే జగన్నాథరాజ్ ఆంధ్ర సినీ టోన్ అనే స్టూడియోను నిర్మించారు. కానీ ఆ తర్వాత దాన్ని మూసేశారు. మద్రాస్ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు విశాఖలోనే స్టూడియో ఏర్పాటు చేయాలని భావించారు. కానీ హైదరాబాద్ తరలిపోయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఈ డిమాండ్ మరో సారి తెర మీదకు వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం సీఎం జగన్ సినీ పరిశ్రమ విశాఖకు రావాలని కోరారు. ఇక్కడ లోకేషన్ లకు కొదవలేదు. ప్రస్తుతం విశాఖలో రామనాయుడి స్టూడియో మాత్రమే ఉంది. విశాఖలో సినీ ఇండస్ట్రీకి పనికి వచ్చే ప్రాంతాలు, సినిమా నిర్మాణం జరగకపోవడానికి గల కారణాల గురించి తెలియాలంటే.. ఈ వీడియో చూడండి.