క్రైం డెస్క్- ఈ మధ్య సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సైబర్ క్రైం రేట్ మరీ మితిమీరిపోతోంది. ఆన్ లైన్ లావాదేవీలు, అన్ లైన్ ట్రేడింగ్ పేరుతో చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో ఘోరంగా మోసపోయింది. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వార పరిచయం అయిన వ్యక్తిని నమ్మి ఏకంగా 10 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. చివరికి మోసపోయానని తెలిసి, చేసేది లేక పోలీసులను ఆశ్రయించిందా యువతి.
హైదరాబాద్ కు చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోని వెబ్ సైట్ లో తన పేరును రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను లండన్‌లో ఉంటానని చెప్పాడు. ఇంకేముంది ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
అతడు చెప్పే మాటలన్నీ ఆ యువతి నమ్మేసింది. తాను ఎక్కువ రోజులు లండన్ లో ఉండలేనని, వారం రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తానని చెప్పాడా మోసగాడు. ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వచ్చేప్పుడు మనం కలసి బతికేందుకు పెద్ద ఎత్తున డబ్బు కూడా తెస్తున్నానని నమ్మబలికాడు. ఇంకేముంది మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్ అధికారులమంటూ అతడికి చెందిన ముఠా ఆమెకు కాల్ చేసి, అతడు తెచ్చే పెద్ద మొత్తంలో డబ్బుకు ట్యాక్స్ కట్టాలని 10లక్షల రూపాయలు వసూలు చేశారు.
ఆ తరువాత ఎంతకీ అతడి నుంచి స్పందన రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.