గ్లామర్ ఫీల్డ్‌లో ప్రేమించుకోవడం.. కొన్నేళ్లపాటు కలిసి ఉండటం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం చాలా కామన్. ఇంకా కొంతమంది అయితే.. తమ బంధానికి ఎలాంటి ముగింపు ఉంటుందో అనే విషయం కూడా ఆలోచించకుండా పిల్లల్ని కంటారు. మోడలింగ్, సినిమా ప్రపంచంలో ఇవన్ని సర్వ సహజం. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోయిన్లు, హీరోలు ఇంకా పెళ్లి ఊసేత్తకుండా నచ్చిన వారితో డేటింగ్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదేమంటే.. మా బంధం పెళ్లి వరకు కొనసాగడం కఫ్టం అంటున్నారు. ఈ కోవలోకే వస్తుంది మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచితమే. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సుస్మితా సేన్ తాజాగా ఆర్య వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని కన్నా ముందు బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వార్తలతో మరింత పాపులర్ అయ్యింది. ఇక తాజాగా ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్' కార్యక్రమంలో వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది సుస్మితా సేన్. 'అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. కానీ నేను ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమే. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నా పిల్లలు ముక్తకంఠంతో అంగీకరించారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి నేను సుమారు మూడు సార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. అతను మమ్మల్ని ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వడు' అని సుస్మితా సేన్ తెలిపింది. సుస్మితా సేన్ గతేడాది బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2000 సంవత్సరంలో రెనీని, 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా సేన్ 1996లో వచ్చిన 'దస్తక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత బీవీ నెంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా, తుమ్కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి చిత్రాలతో పాటు ఆర్య, ఆర్య 2 వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. పెళ్లిపై సుస్మితా సేన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.