నటులు : అల్లు అర్జున్ , రష్మికా మందన్న ఫహాద్ ఫాజిల్ సునీల్ శెట్టి
దర్శకత్వం : సుకుమార్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది పుష్ప. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. రెండు భాగాలుగా పుష్ప తెరకెక్కుతుండగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ‘తగ్గేదే లే’ అంటూ జనం ముందుకు వచ్చిన ‘పుష్ప’ రాజ్ తన మాటను నిలబెట్టుకున్నాడో లేదో చూద్దాం!
కథ :
రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప (అల్లు అర్జున్), అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. పుష్పని అడ్డు పెట్టుకొని కోట్లు గడించిన కొండా రెడ్డి (అజయ్ ఘోష్) కి అతని తముళ్లకు పుష్ప ఎలా ఎదురు వెళ్తాడు.. వాళ్లకు ఎలా చుక్కలు చూపిస్తాడు.. అనుక్షణం అడ్డు వస్తున్న పోలీసులను ఎలా ఎదుర్కొంటాడు.. ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్)కు పక్కలో బల్లెంగా ఎలా మారాడు? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే ఇందులోని ప్రధానాంశం. మదర్ సెంటిమెంట్, అటు లవ్ సెంటిమెంట్ కూడా మిక్స్ చేశాడు. ఈ ఉద్వేగభరిత సంఘటనలు ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలిగిస్తాయి.
విశ్లేషణ :
అడవులను అడ్డంగా నరికేస్తూ, అక్కడి వృక్ష సంపదను, ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అంశాలతో ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి. అందుకు భిన్నమైన కథను ‘పుష్ప – ది రైజ్’ కోసం రచయిత, దర్శకుడు సుకుమార్ రాసుకున్నాడు. పుష్ప అల్లు అర్జున్ వన్ మాన్ షో అనేది ట్విట్టర్ కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. అదే సమయంలో రష్మిక నటన చాలా అద్బుతం. అల్లు అర్జున్(పుష్ప).. ఎర్రచందనం కూలీలకు లీడర్. శేషాచలం అడవుల్లో ఈ గ్యాంగ్ అంతా కలిసి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఓసారి పోలీసులు వచ్చి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు పుష్ప. సినిమా ప్రారంభమైన మరుక్షణం నుండి ఆడియెన్స్ కు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తిగా, తన మాటే నెగ్గాలనే తత్త్వమున్న మొరటోడిగా బన్నీ బాగా చేశాడు. ‘తగ్గేదే లే’ అనే మేనరిజాన్ని ఒక్కో చోటా ఒక్కోలా పలికి ఆకట్టుకున్నాడు. మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. సినిమాలో విలన్లను భరతం పట్టి తన పంతం నెగ్గించుకునే పాత్రలో అల్లు అర్జున్ విశ్వరూపాన్ని చూపించాడు.
నటీనటుల పనితీరు:
పుష్ప మూవీలో అల్లు అర్జున్ గా కాకుండా పుష్ప రాజ్ గా మాస్ పర్ఫామెన్స్ తో ఓ రేంజ్ కి తీసుకు వెళ్లాడు. ఎక్కడా తగ్గేదే లే అనిపించాడు. ఈ దెబ్బతో పాన్ ఇండియా లెవెల్లో బన్నీ నటనకు మంచి ప్రశంసలు రావడం ఖాయం. ఇక పాలు అమ్ముకునే దిగువ మధ్య తరగతి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో రశ్మిక ఒదిగి పోయింది. స్మగ్లింగ్ కింగ్ గా కొండా రెడ్డి (అజయ్ ఘోష్) నటన సినిమాకు ప్రత్యేక హైలెట్. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్ ఘోష్, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు. ఇక ఈ మూవీలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అంటే సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు. ప్రకాశ్ రాజ్, ధనుంజయ్, బాబీ సింహా, జగపతిబాబు, అనసూయ తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
సుకుమార్ సినిమాలలో పాత్రలు,వాటి నేపథ్యాలు చాలా బలంగా ఉంటాయి. పుష్ప మూవీలో పుష్ప రాజ్ మాత్రమే కనిపిస్తాడు. తెరపై అల్లు అర్జున్ ని చూస్తున్న భావన కలగదు. అల్లు అర్జున్ మేనరిజం, చిత్తూరు డైలెక్ట్ అద్భుతమన్న అభిప్రాయం నెటిజెన్స్ వ్యక్తపరుస్తున్నారు. సాంకేతిక నిపుణులలో అగ్రతాంబూలం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కే ఇవ్వాలి. ఇందులోని అన్ని పాటలూ చార్ట్ బస్టర్స్ కావడం విశేషం. అలానే మిరోస్లా క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. చంద్రబోస్ అందించిన పాటలు ఇటు సాహితీ కారుల్ని, అటు కుర్రకారుని ఆకట్టుకునే ఉన్నాయి. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంబ్స్ కలిగిస్తాయి. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ మూవీకి మరో హైలైట్. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదనేది తెర మీద చూస్తే అర్థమౌతుంది.
ప్లస్ పాయింట్స్ : అల్లు అర్జున్, టెక్నీషియన్స్,ఆర్టిస్టుల మేకోవర్, సంగీతం
మైనస్ పాయింట్స్ : క్లయిమాక్స్, మూవీ రన్ టైమ్, కొన్ని బోరింగ్ సీన్లు
రేటింగ్ : 2.5/ 5
బాటమ్ లైన్ : ‘పుష్ప’ఫ్యాన్స్ కి సూపర్ కిక్