గతవారం రోజులుగా తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. సరిగ్గా ఐదేళ్ల కిందట కురిసిన వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం కాగా.. ప్రస్తుతం కూడా అదే భయానక పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితిలో శాంతిభద్రతలే కాదు, ఆపన్నులను ఆదుకోవడంలోనూ తాము ముందుంటామని ఓ మహిళా ఎస్సై తాజాగా నిరూపించారు.
భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరంలోని టీపీ చత్రం ప్రాంతంలో ఓ అభాగ్యుడు అపస్మారక స్థితిలో ఉండగా, రాజేశ్వరి అనే లేడీ ఎస్సై అతనిని స్వయంగా తన భుజాలపై వేసుకుని మోశారు. స్థానికుల సహకారంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లేడీ ఎస్సై మానవతా దృక్పథానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. కాగా ఈ వీడియో చూసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎస్సై రాజేశ్వరిని ప్రశంసించారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో తమిళనాడు పోలీసు అధికారిణి లేడీ ఎస్సై రాజేశ్వరి సేవలు ప్రశంసనీయం అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘‘భారీ వర్షాలలో సైతం భారమైనా బాధ్యతను నెరవేర్చిన పోలీసు అధికారిణి రాజేశ్వరి గారు చెన్నై తుఫాను సహాయక చర్యల్లో సృహ కోల్పోయిన వ్యక్తిని తన భుజంపై వేసుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు ఆమెకు వీరమహిళ విభాగం తరుపున సెల్యూట్’’అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం లేడీ ఎస్సై రాజేశ్వరికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Laudable & inspirational gesture of Tamilnadu Police officer ‘Ms.Rajeshwari garu,’during Chennai floods,JSP congratulates her. https://t.co/ptpysoSQzk
— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2021