Chiranjeevi: తెలుగు వెండి తెర ‘‘గ్యాంగ్ లీడర్’’ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకునే చిరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారింది. సందర్భం 1: చిన్నప్పుడు మా అమ్మ ఒక యల్లో కలర్ టి షర్ట్ వేసి చిరంజీవిలా ఉన్నావురా అని మురిసిపోయింది. అక్కడ తల్లి ప్రేమలో మొదటిసారి నాకు చిరంజీవి అన్న పేరు తెలిసింది. సందర్భం 2 : మా పెద్దమ్మ సినిమా చూస్తూ.. సినిమాలో చిరంజీవిని పోలీస్ కొడుతుంటే ఓయమ్మ నా బిడ్డని కొట్టేస్తున్నారు అంటూ ఏడ్చింది. ఇక్కడ చిరంజీవి ప్రేక్షకులకు ఎంత దగ్గర అయ్యాడో అర్థం అయింది. సందర్భం: 3 మా ఇంటి దగ్గర బాబ్జి అన్న మంచి ఆర్టిస్ట్..! కలుగోళమ్మ తల్లికి హారతి ఇచ్చే చేత్తో. బొగ్గు ముక్కని పట్టుకొని పిట్టగొడ మీద చిరంజీవి బొమ్మ వేసేశాడు. ఇక్కడ ఒక కళాకారుడికి చిరంజీవి ఎంత ఇన్సిప్రెషనో తెలిసింది. సందర్భం 4: పల్లెటూరిలో ఏ ఇంట్లోకి వెళ్లినా గోడల మీద చిరంజీవి పోస్టర్స్ కనిపిస్తుంటే అప్పుడు చిరంజీవి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసింది. సందర్భం 5: రిక్షావాడు సినిమాకి తీసుకొని పోకుండా.. అడవిలో అన్న సినిమాకి తీసుకొని పోతున్నారు అని.. అలిగి కావలి వెంకటేశ్వర థియేటర్ రోడ్డు మీద ఏడ్చి మా అన్నతో గొడవ పెట్టుకున్నప్పుడు తెలియకుండానే నాకు చిరంజీవి నచ్చేశాడు అన్న నిజం అర్థం అయింది. సందర్భం 6: కొంచెం సినిమా అంటే అర్థం అయ్యే వయసు వచ్చాక.. చిరంజీవి ఫైట్స్, డ్యాన్స్ లు చూసి మాస్ హీరో అంటే ఎలా ఉండాలో, ఆయన మెగాస్టార్ ఎలా అయ్యాడో అర్థం అయింది. తరువాత మెగాస్టార్ అన్న ఆ పిలుపు వెనుక ఎంత కష్టం ఉందొ అర్థం అయింది. సందర్భం 7: వేల సంఖ్యలో అభిమాన సంఘాలు, లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నవేళ నాకు కటౌట్స్ కట్టండి, పాలాభిషేకాలు చేయండి అని చెప్పకుండా రక్తదానాలు చేయండి..10 మందిని బతికించండి, ఐ డోనేషన్స్ చేయండి నలుగురికి వెలుగుని పంచండి అని పిలుపు నిచ్చారు. కరోనా లాక్డౌన్ సమయంలో తిండిలేక అల్లాడుతున్న చిత్ర పరిశ్రమ కార్మికులకు అండగా నిలిచినపుడు ఆయనలో సేవా గుణం అర్థం అయింది. సందర్భం 8: తనకి పడని రాజకీయాలలోకి వచ్చి, నలిగి, ఇక నలగలేక ఆ రాజకీయాలలో నుండి తప్పుకున్నప్పుడు మాస్ మెగాస్టార్ కి ఉన్న మంచితనం అర్థం అయింది. సందర్భం 9: అన్నేళ్ల గ్యాప్ తరువాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చి.. దుమ్ము పట్టిన రికార్డుల తుప్పు వదలకొట్టినప్పుడు బాస్ క్యపాసిటీ ఏంటో తెలిసింది. సందర్భం 10 : ఇప్పుడు ఈ వయసులో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతుంటే ఆయనకి సినిమాలు అంటే ఎంత కమిట్మెంటో అర్థం అవుతుంది. ఇలా నా 30 ఏళ్ల జీవితంలో నాకు ఇన్ని సార్లు, ఇన్ని విధాలుగా అర్థం అవుతూ, అలరిస్తు, ఆకట్టుకుంటు, స్ఫూర్తిని కలిగిస్తున్న టాలివుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవి కూడా చదవండి : పెళ్లి సమయంలో నారా లోకేష్, బ్రాహ్మణి ఎలా ఉన్నారో చూశారా.. వైరలవుతోన్న నిశ్చితార్థం వీడియో!