మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి చిరు సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారనే ఆసక్తిగా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఆ తర్వాత కొద్దిరోజులకే చిరు పక్కన కాజల్ అగర్వాల్ ఓకే అయ్యిందని అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. అప్పుడు ఫ్యాన్స్ అంతా.. హమ్మయ్య మరోసారి చిరు – కాజల్ పెయిర్ తెరపై సందడి చేయనున్నారని భావించారు. తీరా షూటింగ్ మొదలవ్వడం.. లాహే లాహే సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది.
ఓకే కాజల్ కూడా ఆ పాటలో చిందేసింది కాబట్టి చిరు సరసన మరో మాస్ సాంగ్ సెట్ చేశారేమో అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇటీవల ఆచార్య టీజర్ – ట్రైలర్ రిలీజ్ చేసేసరికి కాజల్ ఫ్యాన్స్ అందరూ షాక్ లోకి వెళ్లిపోయారు. ఎందుకంటే.. టీజర్, ట్రైలర్ లో ఎక్కడా కూడా కాజల్ కనిపించలేదు. అటు కాజల్ ఫ్యాన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ లో కూడా కాజల్ పాత్రపై సందేహాలు మొదలయ్యాయి. అసలు కాజల్ పాత్రను ఎందుకు చూపించలేదు.. సినిమాలో ఉన్నట్టా లేనట్టా..? అనే సందేహాలకు దర్శకుడు కొరటాల శివ షాకింగ్ సమాధానం ఇచ్చారు.ఆచార్యలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఇద్దరు హీరోయిన్లని భావించారు. కానీ సినిమాలో పూజా మాత్రమే హీరోయిన్. కాజల్ లేదు. ఆమెను మొదటి షెడ్యూల్ లోనే కట్ చేశాం అంటూ ట్విస్ట్ ఇచ్చారు కొరటాల. ఆయన మాట్లాడుతూ.. “కాజల్ కి ధర్మస్థలిలో ఉండే ఓ సరదా అమ్మాయి క్యారెక్టర్ అనుకున్నాం. కానీ ఈ సినిమాలో నక్సలైట్ సిద్ధాంతాలు కలిగిన ఆచార్య పాత్రకు లవ్ ఇంటరెస్ట్ పెడితే బాగోదని అనిపించి.. బాగా ఆలోచించాను. పైగా ఆ క్యారెక్టర్ కి సాంగ్ ఉండవు, సరైన ముగింపు ఉండదు. నేను రాసుకున్న కథ ప్రకారం ఉండకూడదు.
అయినా కమర్షియల్ ఫార్మాట్ లో హీరోయిన్ ను పెడదాం అని కాజల్ ను తీసుకున్నాం. ఫస్ట్ షెడ్యూల్ లో 3-4 రోజులు షూట్ చేశాం. ఆ తర్వాత చూసుకుంటే ఆమె పాత్రపై డౌట్ పెరిగింది. ఇదే విషయాన్నీ చిరంజీవి గారితో చెప్పాను. ఆయన కూడా కథ ప్రకారం వెళ్ళమన్నారు. చివరిగా కాజల్ కు విషయాన్ని చెప్పగానే ఆమె అర్థం చేసుకొని తప్పుకుంది” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆచార్యలో కాజల్ పాత్ర లేదని క్లారిటీ అయితే వచ్చేసినట్లే. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధగా కనిపించనున్నాడు. ఏప్రిల్ 29న ఆచార్య విడుదల కాబోతుంది. మరి ఆచార్య సినిమాపై అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.