మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అనుసూయ, అర్జున్, ఉన్ని ముకుంద ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్ నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఖిలాడి విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఖిలాడి చిత్రం చిక్కులో పడినట్లు సినివర్గాల టాక్. ‘ఖిలాడి’ మూవీ దర్శకనిర్మాతలపై బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ కేసు పెట్టారని సమాచారం. మరి ఈ సినిమా వివాదానికి అసలు కారణం ఏంటంటే.. ఖిలాడి అనే టైటిలే అని తెలుస్తుంది. ఖిలాడి టైటిల్ తనకు చెందినదని.. ఇదే టైటిల్ తో 1992లో అక్షయ్ కుమార్ హీరోగా సినిమా విడుదల చేసినట్లు రతన్ జైన్ తెలిపాడు.
ఈ విషయంపై నిర్మాత జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఖిలాడి టైటిల్ తో తెలుగులో సినిమా తెరకెక్కుతున్న విషయం నాకు తెలియదదు. ఇటీవలే ఆ సినిమా ట్రైలర్ చూశాక తెలిసింది. ఖిలాడి పేరుతో ఇదివరకే నేను రిజిస్టర్ చేయించాను. కాబట్టి, రవితేజ నటించిన ఈ సినిమాకు టైటిల్ మార్చాలి’ అంటూ డిమాండ్ చేశారు. అలాగే తాను డబ్బుల కోసం కాదని, హిందీ ఖిలాడి సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నానని జైన్ చెప్పుకొచ్చారు.
దక్షిణాదిన లోకల్ అసోసియేషన్స్ లో టైటిల్ రిజిస్టర్ చేయించి, వారి సినిమాలను అదే టైటిల్‌తో హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. బాలీవుడ్ సినిమా టైటిల్స్ కి దగ్గరగా ఉండే డబ్బింగ్ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు CBFC పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుందని, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడు లేవని జైన్ అన్నారు.
ఈక్రమంలో రవితేజ నటించిన ఖిలాడి సినిమా టైటిల్ ను మార్చేవరకు రిలీజ్ ను ఆపాలని కోర్టును సంప్రదించగా.. ‘సమయం మించిపోయిందని మెజిస్ట్రేట్ వ్యాఖ్యానించిందని.. దీంతో కనీసం ఓటీటీ రిలీజ్ ను అయినా ఆపాలని కోర్టుని కోరారు. నిర్మాత జైన్ ఫిర్యాదుపై ఖిలాడి టిమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.