Bigboss Show: తెలుగు రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా 2017లో ఈ షో మొదలైంది. భారీ టీఆర్పీలతో ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటివరకు 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజన్ 6 నడుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో 24 గంటల లైవ్ నడుస్తోంది. అయితే, ముందున్న జోరు ప్రస్తుతం లేదు. ప్రజలు కూడా షోను అంతగా పట్టించుకోవటం లేదు. తొలినాళ్లలో పేరు మోసిన సెలెబ్రిటీలు సీజన్‌లలో ఉండటం. వారి మధ్య లవ్ ట్రాకులు, ముద్దులు, గొడవలు, సీక్రెట్ టాస్కులు ఇలా సీజన్‌లు అద్భుతంగా నడిచాయి. ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ షో కంటెంట్ అశ్లీలతను ప్రేరేపించేదిగా ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి. 2019లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బిగ్‌బాస్ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహిస్తోందంటూ.. షోను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఆ పిల్‌పై అత్యవసర విచారణ జరపాలని శుక్రవారం పిటిషనర్ తరుపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. బిగ్‌బాస్ షోల వల్ల యువత తప్పుదోవ పడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ మంచి పిల్ వేశారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయి. ‘ మా పిల్లలు బాగున్నారు.. ఇలాంటి షోలతో మనకేం’ అని ప్రజలు అనుకుంటున్నారు. సమాజంలో ఇతరుల గురించి పట్టించుకోకపోతే.. భవిష్యత్తులో మనకు ఏదైనా సమస్య వచ్చినపుడు ఇతరులు పట్టించుకోరు’’ అని పేర్కొంది. సోమవారం పిల్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. మరి, హైకోర్టు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Supreme Court: ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సిందే..! సుప్రీంకోర్టు ఆదేశం!