కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ సెలబ్రిటీ టాక్ షోలలో ఒకటి ‘ఆలీతో సరదాగా’. సినీ ప్రేక్షకుల అభిమాన సెలబ్రిటీలు, కాలం ఉచ్చులో అభిమానులు మర్చిపోయిన సినీతారలు, దశాబ్దాలపాటు వెండితెరపై వెలుగు వెలిగిన సీనియర్ హీరోలు హీరోయిన్లు, కెమెరా వెనుక కష్టపడే టెక్నీషియన్లను ఈ ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హోస్ట్, నటుడు ఆలీ.
ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు వస్తుంటారు. వారి వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్ లో జరిగిన మంచి విషయాలు, ఎదుర్కొన్న చేదు విషయాలను షేర్ చేసుకుంటారు. అయితే.. ఆలీతో సరదాగా ఇటీవలి ఎపిసోడ్ లో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు చక్రం తిప్పిన రాధికా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైంది.
ఇప్పుడు రాధికాతో సెకండ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో ఎన్నో సరదా విషయాలు షేర్ చేసుకున్న రాధికా.. దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీబి గారి గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యారు. నేను హీరోయిన్ గా చేసిన కొన్ని సినిమాలకు సుహాసిని కెమెరా అసిస్టెంట్ గా పనిచేసిందని.. ఆమె హీరోయిన్ అయ్యాక నేను ఎదురుగా ఉంటే నటించనని చెప్పి నవ్వింది.
ఇక ఇప్పుడు తెలుగు హీరోలలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరంటే.. జూనియర్ ఎన్టీఆర్ అని ఠక్కున చెప్పేసింది. ఎన్టీఆర్ ని ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలవలేదని.. తనతో సినిమాలో నటించాలని ఉందంటూ చెప్పింది. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఇఇ తల్లిగా నటిస్తారా లేక అత్తగానా.. అనగానే ఏదోకటి ముందు ఎన్టీఆర్ తో నటిస్తే చాలు అని తన మనసులో మాట బయటపెట్టింది. రాధికా శరత్ కుమార్ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆమె మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.