టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శన రోజురోజుకు దిగజారుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ పరుగుల యంత్రం అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుండటం ఇందుకో నిదర్శనం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అయితే కోహ్లి ప్రదర్శన పాతాళానికి పడిపోయింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన పర్ఫామెన్స్ పై ‘ఆర్సీబీ ఇన్ సైడర్’ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆర్సీబీ ఇన్ సైడర్ పేరుతో ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ నాగ్, కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లీ తన పర్ఫామెన్స్ పై వస్తున్న విమర్శలను జోకులుగా మలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ ఇంటర్వ్యూలో నాగ్.. విరాట్ కోహ్లిని చాలానే ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలోనే కోహ్లీకి మీరు పెట్స్ ఇష్టపడతారా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కోహ్లీ.. ” అవును ఇష్టపడతాను.. కానీ, వాటిని చూసుకునే సమయం లేదు” అని చెప్పాడు. కానీ.., అంతటితో ఆగని నాగ్ అదేంటి రీసెంట్ గా మీకు రెండు డక్స్ వచ్చాయని, టీవీలో చూశామని అందరూ చెప్తున్నారు అంటూ మరో ప్రశ్న వేశాడు. అయితే.. ఇక్కడ నాగ్ ఉద్దేశం ‘డక్స్’ అంటే నిజమైన బాతులు కాదు.., ఈ మధ్య కాలంలో కోహ్లీ వరుసగా డకౌట్ గా వెనుదిరుగుతున్నాడని అని అర్థం. నాగ్ సెటైరికల్ గా ఈ ప్రశ్న వేశాడు అన్నమాట. ఈ పంచ్ అర్ధం చేసుకున్న కోహ్లీ.. జోవియల్ గానే సమాధానం ఇచ్చాడు. “కెరీర్లో ఎప్పుడు ఇలా కాలేదు. నిజం చెప్పాలంటే.. రెండోసారి అవుట్ అయ్యాక నేను మీలానే ఆలోచిస్తున్నా” అని చెప్పాడు. అయితే గోల్డెన్ డక్స్ పై వస్తున్న విమర్శలు గురించి తాను పెద్దగా పట్టించుకోను అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: Virat Kohli: IPL ప్రదర్శనతో కోహ్లీ సామర్థ్యాన్ని డిసైడ్ చేయడం అంటే అవమానించడమేనా?
ప్రస్తుతం వీరిద్దరి ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు కోహ్లీ ఆడిన 12 మ్యాచుల్లో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. కోహ్లీ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు ఆరు సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఇప్పటికే జరిగిన 14 ఎడిషన్లలో కోహ్లీ మూడుసార్లు మాత్రమే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే ఈ సీజన్లో మాత్రమే మరో మూడు సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు రన్ మెషీన్. ఇందులో రెండు సార్లు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఒక్కసారి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఈ చెత్తరికార్డును సొంతం చేసుకున్నాడు. కోహ్లి ఫామ్ ఇంతలా దిగజారుతున్నప్పటికీ అభిమానులు అతనికి అండగా నిలుస్తుండటం విశేషం. ఈ వైఫల్యాలు కోహ్లిని ఏమీ చేయలేవని, అతను తిరిగి తప్పక పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.