జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అందరికీ వస్తాయి. కష్టం రాగానే కంగారు పడి కుంగిపోయినవాళ్లు జీవితంలో అక్కడే ఉండిపోతారు. వాటిని అధిగమించి జీవితంతో పోరాటం చేసినవాళ్లే విజేతలుగా, నలుగురకి ఆదర్శంగా నిలుస్తారు. అలా పుట్టెడు కష్టాలు, కన్నీళ్లను దిగమింగి ఈ మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు.. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. పుస్తెలు తాకట్టు వ్యాపారం ప్రారంభించి.. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ఆవిడే విశాఖకు చెందిన జయలక్ష్మి.
ఇదీ చదవండి: విధిని ఎదిరించిన మహిళ.. హోటల్ నడుపుతున్న లాయర్!
విశాఖలోని మద్దిలపాలెంకు చెందిన విజయలక్ష్మికి కొన్నాళ్ల క్రితం అనుకోని కష్టం వచ్చింది. తన భర్త శ్రీనివాసరావు అనారోగ్యం బారిన పడ్డారు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా కూడా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఒక్కోక్కళ్లు ఒకలా చెప్పారు. చివరకు కడుపులో పేరుకున్న ప్లాస్టిక్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని తేల్చారు. ఆ తర్వాత ఆపరేషన్ కోసం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేయాల్సి వచ్చింది. భర్త సంపాదించే పరిస్థితి లేదు. ఇంటి భారం మొత్తం విజయలక్ష్మిపై పడిపోయింది. అప్పుడు ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. తన భర్తకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని భావిచింది. బిస్కెట్ టీ కప్పులు తయారు చేయాలని పూనుకుంది.
అందుకు పెట్టుబడి కోసం తన తాళిబొట్టు కూడా తాకట్టు పెట్టింది. కానీ, పెట్టుబడి సరిపోలేదు. అందుకు బ్యాంకుల చుట్టూ తిరిగింది. ఒక్కో బ్యాంకు చుట్టూ మూడునెలల పాటు తిరిగినా ప్రయోజనం లేదు. కొందరైతే అసలు అలాంటి వ్యాపారం కూడా ఉందా అని హేళన చేశారు. ఆ తర్వాత కెనరా బ్యాంకు వాళ్లు రూ.16 లక్షల రుణం ఇచ్చారు. ఆ తర్వాత విజయలక్ష్మి వ్యాపారం ప్రారంభించారు. అనతి కాలంలోనే వ్యాపారం నిలదొక్కుకుంది. బాగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. కేవలం ఏపీ నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి కూడా వారి టీ కప్పులకు డిమాండ్ పెరిగింది.
ఇదీ చదవండి: బృందావనంలో వితంతువుల రంగుల పండుగ..
ప్రస్తుతం రోజుకు 6 వేల కప్పుల చొప్పున నెలకు లక్షన్నర కప్పులకు పైగానే సప్లై చేస్తున్నారు. 80 ఎంఎల్ కప్పు 3 రూపాయలు, 60 ఎంఎల్ కప్పు ధర 2 రూపాయలుగా విక్రయిస్తున్నారు. ఆవిడ వ్యాపారంతో మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆవిడ వ్యాపారం ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తోంది. మీ విజయ రహస్యం ఏంటని విజయలక్ష్మిని అడిగితే.. ‘ఏ పనైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయండి. ఇష్టంగా చేసే ఏ పనైనా మీకు లాభాలు తెచ్చిపెడుతుంది’ అంటూ చెబుతున్నారు. విజయలక్ష్మి శ్రీ హర్ష ఎంటర్ ప్రైజెస్ టీ బైట్ కప్పుల తయారీ విధానం ఈ కింది వీడియోలో చూసేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.