ఫిల్మ్ డెస్క్- కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి అంతకంతకు పెరిగిపోతున్ననేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సినీ రంగ ప్రముఖులు పలు సందర్బాల్లో సందేశాలు ఇస్తూవస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేయాలంటూ ఇప్పటికే చిరంజీవి, నాగార్జున లాంటి వారు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా నిర్మూలనలో భాగం కావాలంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది రాజమౌళి అండ్ టీం. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రతీ ఒక్కరికీ ఈ సమాచారం అందేలా అర్థమయ్యేలా దక్షిణాది, ఉత్తరాది ప్రధాన భాషల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ విజ్ఞప్తి చేయడం అందరిని ఆకట్టుకుంది. తెలుగులో బాలీవుడ్ నటి ఆలియాభట్, తమిళంలో మెగా హీరో రాంచరణ్, కన్నడలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మలయాళంలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, హిందీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మాట్లాడారు. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని.. దీని బారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఆయుధాలు మాస్క్, శానిటైజర్స్, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని వీళ్లంతా వీడియో ద్వార విజ్ఞప్తి చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీం చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.