కరోనాతో చనిపోతే ఆ వ్యక్తిని ముట్టుకునేందుకు కుటుంబ సభ్యులు సైతం రాని పరిస్థితి. వైరస్ భయంతో వారి అంత్యక్రియల్ని కూడా నిర్వహించడం లేదు. తమవారు చనిపోయిన కరోనా భయంతో వారి కడసారి చూపులకు కూడా కుటుంబసభ్యులు రావడంలేదు. బంధువులు కూడా మొఖం చాటేస్తున్నారు. కొందర్నీ అయితే చనిపోతే ఆస్పత్రుల్లోనే వదిలివేేస్తున్నారు. అయినవారు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అలాంటి కరోనా నిబంధనలను అతిక్రమించి గుర్రం అంత్యక్రియలకు వేల మంది తరలివచ్చారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది. ఓ గుర్రం చనిపోతే వందలాది మంది కలిసి కరోనా నిబంధనలు పాటించకుండా.. అంత్యక్రియలు నిర్వహించారు. మరాదిమత్ గ్రామంలో ఆదివారం స్థానిక మత సంస్థకు చెందిన గుర్రం చనిపోయింది. ఈ గుర్రాన్ని దేవతా అశ్వంగా గ్రామస్థులు భావిస్తారు. అయితే లాక్డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా గుర్రం అంత్యక్రియలకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి పాల్గొన్నారని పలువురు పేర్కొన్నారు. సంఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామానికి సీలు వేసి పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోకి ఎవ్వరినీ రానీయడం లేదు. గ్రామం నుంచి వెళ్లనివ్వడం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఆంక్షలు 14 రోజుల పాటు అమల్లో ఉంటాయని బెలగావి ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి తెలిపారు.