somesh kumar హైదరాబాద్- తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కాస్త బెటర్ గానే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మందులు, వ్యాక్సిన్, ఆక్సిజన్, బెడ్ లకు ఎలాంటి కొరత లేదని సోమేష్ కుమార్ తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయన్న ఆయన, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ తో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. సీఎంకు స్వయంగా కరోనా పాజిటివ్ వచ్చినా, ఎప్పటికప్పుడు తమతో చర్చిస్తూ రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారని సీఎస్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకుంటున్నారని.. హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్కు హబ్‌గా తయారైందని అన్నారు. తెలంగాణలో 120 టన్నుల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుందని, అందు కోసం 400 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని సోమేశ్ కుమార్ చెప్పారు. cs somesh kumar ఇక కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదించి, తెలంగాణకు రావాల్సిన ఆక్సీజన్, రెమిడేసివిర్ ఇంజక్షన్లను పంపమని కోరామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 11 లక్షల కోవిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. కొంత మంది అవసరం లేకున్నా రెమిడిసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నారని, లక్షణాలుంటేనే టెస్టులు చేయించుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 42 లక్షలకు పైగా కరోనా టీకా వేశామని, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు సూచన మేరకు అవసరమైతే వీకెండ్ లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సీఎస్ అన్నారు.