తిరువనంతపురం- కేరళ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు అధికారాన్ని మార్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారు కేరళ ఓటర్లు. పినరయి విజయన్ ఆధ్వర్యంలోని వామపక్ష కూటమికి మళ్లీ రెండోసారి అధికారం కట్టబెట్టారు. ప్రతి ఎన్నికకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య మారే అధికారం మారుతూ వస్తుండగా, ఈ సారి వరుసగా రెండోసారి సీపీఎం సారథ్యంలోని వామపక్షకూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా విలయ తాండవం, కాంగ్రెస్, బీజేపీల దాడి, శబరిమల వివాదం, తదితర ప్రతికూల అంశాలు వెంటాడినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ చాకచక్యంగా వ్యవహరించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలుండగా, అధికార ఎల్డీఎఫ్ 99 స్థానాలను కైవసం చేసుకోగా, యూడీఎఫ్ 41 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించనుంది.