ప్రతి ఆడపిల్లకు బాగా చదువుకోవాలని.. మంచి ఉద్యోగం సంపాదించి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని కోరుకుంటుంది. స్వేచ్ఛగా బతకాలనుకుంటుంది. కానీ నేటికి కూడా చాలా మంది ఆడపిల్లల విషయంలో నేటికి కూడా ఇవన్ని కలలుగానే మిగిలిపోతున్నాయి. ఆడపిల్లను బరువుగానే భావించే తల్లిదండ్రులు ఇప్పటికి ఉన్నారు. ఇక కన్నవాళ్లే తన బిడ్డ ఆశలు పట్టించుకోనప్పుడు.. మెట్టినింటి వారిమీద నమ్మకం పెట్టుకోవడం ఎండమావిలో నీటి కోసం వెదకడం లాంటిదే. చాలామంది మగాళ్లకు.. భార్య అంటే తనతో పాటు.. అతడి కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటే చాలు. నిరంతరం వారి గురించే ఆలోచించాలి. ఇలానే భావిస్తారు. ఇక పెళ్లి తరువాత చదువు అంటే.. చాలా కష్టం. నూటికో కోటికో ఒక్కరు మాత్రమే.. అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత చదువుకోగలరు. కొందరు భర్తలు మాత్రం భార్య మనసులో కోరికలను, ఆశలను తెలుసుకుని.. వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ కోవకు చెందిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ దంపతుల కథ తెలిసిన వారు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండంలోని చల్వాయి గ్రామానికి చెందిన శ్రీను పదో తరగతితో చదువు ఆపేసి.. కుటుంబానికి అండగా నిలిచాడు. హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడికి నర్సంపేట గ్రామానికి చెందిన నాగమణితో వివాహం అయ్యింది. ఈ క్రమంలో పెళ్లైన కొత్తలో ఓ రోజు నాగమణి తన మనసులో కోరికను భర్త ముందు బయటపెట్టింది. పోలీస్ జాబ్ తన జీవితాశయం అని వెల్లడించింది. భార్య మనసు అర్థం చేసుకున్న శ్రీను.. వచ్చే జీతంలో సగం మొత్తాన్ని చదువు కోసం ఖర్చుపెట్టేవాడు. నాగమణి కూడా కష్టపడి చదివి.. పోలీస్ ఉద్యోగం సంపాదించుకుంది. కానిస్టేబుల్‌గా సెలక్టయ్యింది.భార్యకు పోలీస్ ఉద్యోగం రావడంతో మెట్రో రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని వదిలేసి..ఇద్దరు ములుగు వచ్చేశారు. తన భార్య కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నా.. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మనసు రాలేదు శ్రీనుకు. తాను కూడా ఏదో ఒక పని చేయాలని భావించి.. ములుగు ఏరియా ఆస్పత్రి ఎదురుగా తోపుడు బండిపై 20 రూపాయలకే భోజనం అంటూ తక్కువ ధరకే మంచి ఆహారం అందించేవాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. శ్రీను వ్యాపారం అభివృద్ధి చెందసాగింది. ఇలా ఉండగా.. 317 జీవోలో భాగంగా నాగమణికి మహబూబాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. శ్రీను కూడా భార్యతో పాటు మహబూబాబాద్‌కు వచ్చాడు. ఇక ఇక్కడ కూడా సాంప్రదాయ ఆహారం అయిన రాగి జావ, మొలకెత్తిన విత్తనాలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో కేవలం రోజుకు మూడు గ్లాసులు మాత్రమే అమ్మిన శ్రీను క్రమంగా పుంజుకున్నాడు. ప్రస్తుతం రోజుకు రెండు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. శ్రీను చేసే పనిపై నాగమణి స్పందిస్తూ.. నా భర్త దొంగతనాలు, దోపిడిలు చేయడం లేదు. నిజాయితీగా కష్టపడి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇందులో నేను చిన్నతనంగా ఫీలవ్వాల్సింది.. అవమానపడాల్సింది ఏం లేదు. చాలా గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ దంపతుల గురించి తెలిసిన వారు.. శ్రీను-నాగమణిలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఎందరికో ఆదర్శం అని కొనియాడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Credits- News18 Telugu