కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పర్యటనలో రెండో రోజులో భాగంగా శుక్రవారం నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా బీర్కూరులో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఓ రేషన్ షాపును సందర్శించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిట్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సదరు కలెక్టర్ మీద సీరియస్ అయ్యారు నిర్మలా సీతారామన్. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని అడిగారు నిర్మలా సీతారామన్. అందుకు కలెక్టర్ తనకు తెలియదు అన్నాడు. దాంతో సదరు కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..అర గంట టైం తీసుకొని చెప్పాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుండగా.. దానిలో కేంద్రం ఏకంగా 30 రూపాయలు భరిస్తోందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక రేషన్ షాపు దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుందని ప్రజలకు ఎందుకు చెప్పటం లేదని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల సీతారామన్. సాయంత్రం వరకు ఫోటో ఏర్పాటు చేయకపోతే సాయంత్రం వచ్చి తానే మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది కూడా చదవండి: నిర్మలా సీతారామన్ పై సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు..! ఇది కూడా చదవండి: అధికారికి మంచినీళ్లు అందించిన నిర్మలా సీతారామన్! వీడియో వైరల్..