టెక్నాలజీ వినియోగం పెరిగాక ఆన్ లైన్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కి వెళ్లి క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్షణాల్లో కరెంట్ బిల్ కట్టేయొచ్చు. ఇదొక్కటేకాదు.. మనీ ట్రాన్సఫర్, మొబైల్ రీఛార్జులు, గ్యాస్ బుకింగ్స్, స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, వాటర్ బిల్లులు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రకాల సేవలు క్షణాల్లో పొందవచ్చు. అయితే, ఈ టెక్నాలజీ మనకే కాదు సైబర్ నేరగాళ్లకు కూడా బాగా ఉపయోగపడుతోంది. చదువుకోని వాల్లనే కాదు, చదువుకున్న వాళ్లను కూడా వీళ్ళు మభ్యపెడుతూ అందినకాడికి దోచేస్తున్నారు. అందుకే యూపీఐ పేమెంట్స్ విషయంలో అప్రమత్తత అవసరం. యూపీఐ మోసాలను తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి. మీ యూపీఐ పిన్ ఎవరికీ చెప్పకూడదు. ఏ బ్యాంకు గానీ, సంస్థ గానీ.. మీ యూపీఐ పిన్ అడగవు. కాబట్టి ఎవరికీ యూపీఐ పిన్ చెప్పకూడదు. వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా యూపీఐ పిన్ షేర్ చేయకూడదు. మీకు తెలియని వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని యూపీఐ పిన్ అడుగుతున్నారు అంటే అది మోసం చేయడానికేనని గుర్తించాలి. అలాగే.. మీ పర్సనల్ డేటా ఉన్న స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ యాక్సెస్ మీకు సంభంధం లేని వ్యక్తులకు ఇవ్వకూడదు. మీ బ్యాంకు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేస్తామని, మీ గ్యాడ్జెట్‌కు యాక్సెస్ ఇవ్వాలని అనుమానిత వ్యక్తులు ఎవరైనా కోరితే ఇవ్వకండి. అలాంటివారు సూచించే యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేయొద్దు. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో బహుమతుల పేరుతో జరుగుతన్న మోసాలు గణనీయంగా పెరిగాయి. మీరు ఫలానా బహుమతి గెలుచుకోవాలంటే మీ యూపీఐ యాప్‌లో.. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలని ఎవరైనా అడుగుతున్నారంటే అది మిమ్మల్ని మోసం చేయడానికేనని గుర్తించాలి. ఒకవేళ మీరు.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి.. యూపీఐ పిన్ ఎంటర్ చేశారనికోండి.. క్షణాల్లో మీ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఎక్కువ. మీరు యూపీఐ యాప్ ద్వారా పేమెంట్ చేస్తున్నా, ఎవరికైనా డబ్బులు పంపిస్తున్నా.. ట్రాన్సాక్షన్ పూర్తి చేసేముందు మరోసారి వారి వివరాలు సరిచూసుకోవాలి. మీ యూపీఐ పిన్‌ను తరచూ మారుస్తూ ఉండాలి. కనీసం నెలకు, రెండు నెలలకు ఒకసారైనా యూపీఐ పిన్ మార్చాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ మోసాలతో జాగ్రత్త.. సైబర్ మోసగాళ్లు ముందుగా పేమెంట్ రిక్వెస్ట్ అంగీకరించమని అడుగుతారు. లేకపోతే లావాదేవీ విఫలమవుతుందని చెబుతూ వారిని బట్టులో పడేస్తారు. మీరు పేమెంట్ రిక్వెస్ట్ ను అంగీకరించినప్పుడు, UPI యాప్ మిమ్మల్ని లావాదేవీకి చివరి దశ అయిన పిన్‌ని అడుగుతుంది. అంటే మీరు UPI PINని నమోదు చేసిన వెంటనే, మీ డబ్బు లాగేసుకుంటారు. ఈ విషయంలో అప్రమత్తత చాలా అవసరం. మీకు ఎవరైనా డబ్బులు పంపాలి అంటే.. వారు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అంటే మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. కానీ మీరు డబ్బులు స్వీకరించడానికి మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. చాలావరకు యూపీఐ మోసాలు యూజర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్లే జరుగుతుంటాయి. ఒకసారి డబ్బులు పోయిన తర్వాత తిరిగిపొందడం అంత సులువు కాదు. Avoid being a victim of cyber fraud. You don't need UPI PIN to receive money. Stay Alert and Stay Safe. #UnionBankofIndia #GoodPeopleToBankWith #CyberSafe #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/kDylFG7sOt — Union Bank of India (@UnionBankTweets) February 8, 2022 ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యూపీఐ మోసాలను కొంతమేర తగ్గించవచ్చు. మోసగాళ్లకు మీరు టార్గెట్ కాకుండా బయటపడవచ్చు. ఈసారి యూపీఐ పేమెంట్స్ చేసేప్పుడు ఈ విషయాలన్నీ తప్పక గుర్తుంచుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియాజేయండి.