“పవర్ ఫుల్ పీపుల్స్.. మేక్స్ ప్లేసెస్ పవర్ ఫుల్” ఈ ఒక్క మాట చాలు గంగూలీ అంటే ఏమిటో చెప్పడానికి. సచిన్ తప్ప మరో అండ లేని రోజుల్లో కోల్‌కత్తా నుంచి వచ్చి ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన యోధుడు. నూనూగు మీసాలతో ప్రపంచ క్రికెట్‌లోకి అడుగుపెట్టి తొలి మ్యాచ్‌లోనే క్రికెట్ మక్కా లాంటి లార్డ్స్ మైదానంలో సెంచరీ బాదేశాడు. ఆ ఇన్నింగ్స్‌తో క్రికెట్ పండితులు సైతం నివ్వెరపోయారు. తరువాత కాలంలో అతను వన్డే మ్యాచ్‌ల్లో కూడా విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఫ్రన్ట్‌కి వచ్చి కొట్టే ఆ సిక్సులు, ఆఫ్ సైడ్ కొట్టే ఆ కవర్ షాట్లు క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ఫలితంగా సాధారణ సౌరవ్ గంగూలీ.. అతి తక్కువ కాలంలోనే రాయల్ బెంగాల్ టైగర్ అయిపోయాడు. గంగూలీ ఆటగాడిగా ఎదుగుతూ వస్తున్న సమయంలోనే.. భారత క్రికెట్ టీమ్ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. పదేళ్ల పాటు టీమిండయాకు కెప్టెన్‌గా వ్యవహరించిన మొహమ్మద్ అజహరుద్దీన్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురయ్యాడు. ఈ ఘటన ఇండియన్ క్రికెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. అజహరుద్దీన్ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన సచిన్.. ఆ బాధ్యతను మోయలేక, నా వల్ల కాదు బాబోయ్ అంటూ పక్కకు తప్పుకున్నాడు. అప్పటికే భారత జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వన్డేల్లో జింబాబ్వే కంటే దారుణంగా తయారయ్యాం. టెస్ట్‌ల్లో గెలవడమే మరచిపోయాం. దీనికి తోడు ఆట చుట్టూ రాజకీయాలు, ఆటగాళ్లలో ఇసుమంతైన కానరాని ఆత్మవిశ్వాసంతో భారత జట్టు పసికూనలా కనిపించింది. ప్రత్యర్థి జట్లు కొదమ సింహాల్లా దూసుకుపోతున్నాయి. ఇలా చుట్టూ సవాళ్లుతో భారత క్రికెట్ అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ సమయంలో అందరికీ కనిపించిన ఒకే ఒక్క ఆశా కిరణం సౌరవ్ గంగూలీ. దీంతో బీసీసీఐ పెద్దలు ఒక డొక్కు బస్సులాంటి ఇండియన్ టీమ్‌ను తీసుకెళ్లి నడిపించాల్సిందా గంగూలీ చేతుల్లో పెట్టారు. ఆ సవాలును ఎంతో బాధ్యతగా స్వీకరించిన గంగూలీ అసలు సిసలైన కెప్టెన్సీ అంటే ఎంటో చూపించాడు. ముందుగా టీమ్‌ని ప్రక్షాళన చేశాడు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాథ్, అగార్కర్ లాంటి సీనియర్లను కలుపుకుపోయాడు. వారిలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాడు. టీమ్‌లో వారి ప్రాధాన్యత ఏమిటో వివరించి చెప్పాడు. మిగిలిన స్క్రాప్ మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. అదే సమయంలో జూనియర్ స్థాయి క్రికెట్‌లో అప్పుడప్పుడే మెరుపులు మెరిపిస్తున్న కుర్రాళ్లని వెతికి పట్టుకున్నాడు. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని, ఇర్ఫాన్ పఠాన్, లక్ష్మీపతి బాలాజీ, పార్టీవ్ పటేల్, ఆశిష్ నెహ్రా లాంటి వారిని ప్రొత్సహించి.. జట్టులో వారి స్థానంపై భరోసా ఇచ్చాడు. బాగా ఆడిన రోజుకంటే.. సరిగ్గా ఆడని రోజు వారితో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపేవాడు. యువ క్రికెటర్ల కోసం అవసరమైతే సెలెక్టర్స్‌తో సైతం ఫైట్ చేశాడు. జోన్స్ వారీగా జరిగే పాలిటిక్స్‌కి బ్రేక్ వేసి.., ప్రతిభ ఉన్న ఆటగాడికే పట్టం కట్టాడు. సీనియర్స్, జూనియర్స్‌ని కలగలిపి ఓ అద్భుత జట్టుని తయారు చేశాడు. ఇక్కడి నుంచి ఇండియన్ క్రికెట్‌లో గంగూలీ కాస్తా దాదా అయిపోయాడు. భారత క్రికెట్‌కు మంచి చేసేందుకు ఎవరితోనైనా తలపడే దాదా. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనే కాన్సెప్ట్‌ను ఇండియన్ క్రికెట్‌కు అలవాటు చేశాడు. గెలవాలనే కసిని నూరిపోశాడు. ఇలా తన కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్‌కి స్వర్ణ యుగం సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియాను వారి దేశంలోనే గడగడలాడించాడు. కశ్మీర్ కోసం కార్గిల్ యుద్ధంలో కాదు, క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడి తేల్చుకుందాంరండి అని సవాలు చేసిన చేసిన పాకిస్థాన్‌కి.. వాళ్ల దేశంలోనే చుక్కలు చూపించాడు. మన దేశంలో చొక్కాలు విప్పి చిందులు వేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బుద్ది వచ్చేలా.., లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి దాదా సింహ గర్జన చేశాడు. ఫామ్ కోల్పోయి కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయినా.. నిరాశ చెందకుండా పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ విషయం గమనిస్తే.. కుర్రాడిగా ఉన్నప్పుడు ఉడుకురక్తంలో కాదు అతనిలోనే ఆ పోరాట పటిమ ఉందన్న విషయం గంగూలీ కెరీర్ ముగింపులో కూడా తెలుస్తుంది. గంగూలీ అంటే ఒక స్ఫూర్తి, గంగూలీ అంటే పోరాటం.. గంగూలీ అంటే ధైర్యం.. గంగూలీ అంటే ఇండియన్ క్రికెట్ తలరాత మార్చిన దేవుడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టీమిండియాకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. ఆట నుంచి విశ్రాంతి తీసుకున్నా.. అవిశ్రాంతంగా భారత క్రికెట్‌కు బీసీసీఐ అధ్యక్షుడిగా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాడు. ఇందుకే టీమ్ ఇండియాకి గంగూలీ అందించిన, అందిస్తున్న సేవలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రత్యేకమే. చివరగా ఒక సినిమాటిక్ డైలాగ్.. ( ఖలేజా సినిమా) పశ్చిమ బెంగాల్‌లో 49 ఏళ్ల కింద పుట్టాడొకడు… నేరేడుపండు లాంటి కళ్లు, అరిటాకంత చెయ్య, తుఫాను… తుఫాను కన్నా వేగంగా ఆలోచిస్తాడు.. ఆటలో వాడి తెగింపుకి దేశం అంతా సాహో అంది. వాడి అండతోనే సాధారణ ఆటగాళ్లు స్టార్లుగా ఎదిగారు. వాడి రాకతోనే ఇండియన్ క్రికెట్ ఒళ్ళు విరుచుకుంది.. సిద్దా..! విదేశాల్లో పిల్లులు అన్న మన ఆటగాళ్లు కసిపుట్టినట్టు.. చెలరేగిపోయారు. వాడు లార్డ్స్ మైదానంలో షర్ట్ విప్పి.. గర్జించిన గర్జన ఇంకా చెవుల్లో హోరుమంటోంది! ఎవరిని చూడాలని మాలాంటి అభిమానుల కళ్ళు ఆర్తితో తడుస్తాయో, ఎవరిని చూస్తే క్రికెట్ అభిమానులు అభిషేకం చేస్తారో, ఎవడి వేలు చివర దశాబ్దాల పాటు.. గెలుపు బానిసై ఊడిగం చేసిందో, ఎవడి ఆట చూస్తే ఆనందం మా నుదుటి మీద బొట్టవుతుందో…, ఎవడు చూస్తే.. ఓడిపోతామన్న భయం చస్తుందో… ఎవడు కెప్టెన్ గా ఉంటే గెలుస్తామన్న ధైర్యం వస్తుందో… ఎవడు కోట్ల మంది అభిమానుల ఆశలను దశాబ్దాలుగా మోశాడో.. ఎవడు.. మసకబారిన ఇండియన్ క్రికెట్ ఖ్యాతిని ను మళ్ళీ నిలబెట్టాడో ఆ వన్ అండ్ ఓన్లీ.. ప్రిన్స్ ఆఫ్ కలకత్తా.. రాయల్ బెంగాల్ టైగర్.. ఇండియన్ క్రికెట్ బాస్.. ‘దాదా’ సౌరవ్ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.