ప్రపంచ క్రికెట్‌లో ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుంటే తొలుత సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తోనే మొదలుపెట్టాల్సి వస్తుంది. క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో మాత్రమే మ్యాచ్‌లు గెలవచ్చనే ఆలోచనను చంపేసిన ఫీల్డర్. ఫీల్డింగ్‌తోనూ అద్భుతాలు చేయవచ్చని చేసి చూపించాడు. జాంటీ గాల్లోకి పక్షిలా ఎగురుతూ.. బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న బంతిని ఓడిసి పట్టుకునే దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. అసలు జాంటీ రోడ్స్ మనిషేనా.. ఇతనికి ఏమైన శక్తులు ఉన్నాయా అని అనుమానపడేలా ఫీల్డింగ్ చేసేవాడు. ఫిట్‌నెస్‌పై ఇప్పుడున్నంత అవగాహన లేని రోజుల్లోనే ఫిట్‌గా ఉంటూ చిరుతలా ఫీల్డ్ కదులుతూ మ్యాచ్ విన్నింగ్ క్యాచ్‌లు ఎన్నో అందుకున్నాడు. ఇప్పటికీ అతను అందుకున్న క్యాచ్‌లను చూస్తే నమ్మశక్యం కాదు. అతని తరం క్రికెట్ అభిమానులకు తన ఫీల్డింగ్ విన్యాసాలు చూపించిన రోడ్స్ మరోసారి ఈ తరం వారికి కూడా అదే రేంజ్‌లో ఫీల్డింగ్ చేసి చూపించి షాక్ అయ్యేలా చేశాడు. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్‌లో ఆడుతున్న జాంటీ రోడ్స్.. శనివారం ఇండియా లెజెండ్స్-సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెంజెడ్స్ తరఫున బరిలోకి దిగాడు. తాను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పట్టిన క్యాచ్‌ను తలపించేలా గాల్లోకి డైవ్ చేస్తూ.. అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం జాంటీ ఫీల్డింగ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం రోడ్స్‌కు 53 ఏళ్లు.. ఈ వయసులోనూ ఇలాంటి ఫీల్డింగ్ ఏంటి స్వామీ అంటూ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జాంటీ.. 2003లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలాంటి ఫీల్డింగ్ చేయడం నిజంగా అద్భుతం. కాగా.. జాంటీ తన 11 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. రనౌట్లు చేశాడు. వాటిలో టాప్ 5 గురించి ఒక సారి తెలుసుకుందాం.. 1992 వరల్డ్ కప్: పాకిస్థాన్-సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జాంటీ రోడ్స్.. ఇంజూమామ్ ఉల్ హక్‌ను రనౌట్ చేసిన విధానం ప్రపంచ క్రికెట్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. 48 పరుగుల వద్ద ఉన్న ఇంజూమామ్ ఆఫ్ సైట్ కట్ షాట్ ఆడి సింగిల్‌కోసం ప్రయత్నించగా.. బంతి అందుకున్న జాంటీ ఆమాంతం వికెట్లపై దోకి కళ్లు చెదిరే రనౌట్ చేస్తాడు. దీంతో పాక్ ఆ మ్యాచ్‌లో ఓడిపోతుంది. 1997 సచిన్ క్యాచ్: ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కొట్టిన ఆఫ్ సైడ్ షాట్‌ను పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్నజాంటీ రోడ్స్ తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ ఒక అద్భుతం. 2002 జాంటీ 100వ క్యాచ్: సౌతాఫ్రికా-వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో జాంటీ రోడ్స్ తన 100వ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను కూడా పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు. 1993 డెస్మండ్ హేన్‌తో పరుగు పందెం: సౌతాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా డెస్మండ్ హేన్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. బంతి అందుకున్న జాంటీ.. బ్యాటర్‌తో కంటే వేగంగా పరిగెత్తి.. వికెట్లను గిరాటేసి.. హేన్‌ను పెవిలియన్ పంపిస్తాడు. 1997 బ్రియాన్ లారా అవుట్: సౌతాఫ్రికా -వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేలో బ్రియాన్ లారాను జాంటీ రోడ్స్ రనౌట్ చేసిన విధానం అద్భుతం. పాత తరం క్రికెట్ అభిమానులకు ఈ రనౌట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరి జాంటీ రోడ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో చేసిన ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: సచిన్‌కు పాదాభివందనం చేసిన జాంటీ రోడ్స్!