స్టార్, సీనియర్ అనే ట్యాగ్ ఉంటే సరిపోతుందా.. వారి ఫామ్‌తో, గాయాలతో సంబంధం లేకుండా ఎంపిక చేసేస్తారా..? అది కూడా ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇన్ని లోపాలతో జట్టును ప్రకటిస్తారా? అంటూ సెలెక్టర్లపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు సోమవారం రాత్రి జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టులోకి చాలా గ్యాప్ తర్వాత తిరిగి వచ్చారు. కాగా ఈ టీమ్ ఎంపికపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లతో సంబంధం లేకుండా కేవలం స్టార్, సీనియర్ అని చూసి టీమ్‌లో ప్లేస్ ఇచ్చారంటూ మండిపడుతున్నారు. గాయాలతో సహవాసం చేసే రోహిత్, రాహుల్‌నే పూర్తిగా నమ్మారు..! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ జట్టులో ఓపెనర్లుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఎప్పుడు గాయాలపాలవుతారో వీళ్లకే తెలియదు. టోర్నీ మధ్యలో ఇద్దరిలో ఏ ఒక్కరైనా గాయపడితే.. ఓపెనింగ్ చేసేందుకు జట్టులో సరైన ఓపెనర్ లేడు. గత సిరీస్‌లలో చేసిన ప్రయోగాల్లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ ఓపెనర్లుగా వచ్చినా.. వారిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేం. రోహిత్, రాహుల్ ఇద్దరిలో ఒక్కరైన జట్టుకు దూరమై.. ఓపెనర్ కానీ ఓపెనర్ ఇన్నింగ్స్ ఆరంభించాలంటే జట్టు టెంపో దెబ్బతినడం ఖాయం. పైగా సూర్య, పంత్ ఇద్దరు మిడిల్దార్‌లో ఉండటం జట్టుకు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నిఖార్సయిన మూడో ఓపెనర్‌ను ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పిదమే. పేస్ సంగతి గాలికి.. ఆసియా కప్ కోసం జట్టులో ముగ్గురు మాత్రమే స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నారు. స్పిన్నర్లను మాత్రం ఏకంగా నలుగురిని తీసుకుంది. నాలుగో పేసర్ అవసరమైతే దిక్కులు చూసే పరిస్థితి.. పాండ్యా ఉన్నా కొన్ని సార్లు పూర్తి కోటా కూడా వేయలేడు. టీ20ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసే మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలను సెలెక్టర్లు పట్టించుకోలేదు. పైగా బుమ్రా, అక్షర్ పటేల్ కూడా జట్టులో లేరు. భువీ, అర్షదీప్ సింగ్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఆవేశ్ ఖాన్‌పై నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అవుతుంది. జడేజా, అశ్విన్ అవసరమా..? టీమిండియాలో సీనియర్ ప్లేయర్‌గా ఉన్న జడేజా ఇంగ్లండ్‌తో టెస్టులో మినహా పెద్దగా రాణించిన దాఖాలాలు లేవు. అలాంటప్పుడు అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడా? అనేది అనుమానమే. ఇక రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుండేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్షర్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ జట్టుకు ఎంతో ఉపయోగంగా ఉండేవాడని అంటున్నారు. డీకే జట్టులో ఉన్నా లేనట్లే.. టీమిండియాలోకి ఒక ఫినిషన్ రూపంలో దూసుకొచ్చిన సీనియర్ ప్లేయర్‌ను ఆసియా కప్‌లో టీమిండియా వాడుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే సెలెక్టర్ల ఎంపిక అలా ఉంది. రోహిత్, రాహుల్ ఓపెనర్లు, కోహ్లీ, సూర్య, పంత్, హార్దిక్ పాండ్యా ఇలా అక్కడికే ఆరుగురు బ్యాటర్లతో జట్టు నిండిపోయింది. రవీంద్రా జడేజా ఏడో స్థానంలో ఉంటాడు. ఇక డీకేకు జట్టులో స్థానం ఎక్కడిది? ఎనిమిదో బ్యాటర్‌గా డీకేను తీసుకుంటే బౌలింగ్ విభాగం బలహీనంగా మారుతుంది. దీంతో డీకే తుది జట్టులో ఆడడం దాదాపు అసంభవమే అంటున్నారు క్రికెట్ నిపుణులు. ఆసియా కప్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టు ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్. స్టాండ్‌బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఉన్నారు. #TeamIndia squad for Asia Cup 2022 - Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan. — BCCI (@BCCI) August 8, 2022 's #AsiaCup Squad pic.twitter.com/x63JDqkS3l — Cricbuzz (@cricbuzz) August 8, 2022