రన్ మెషీన్‌గా పేరున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే 70 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన కోహ్లీ ఇంగ్లండ్‌లో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో చేసిన హైఎస్ట్ స్కోర్ 20. పైగా కోహ్లీ సెంచరీ చేసి మూడేళ్లు అవుతుంది. దీంతో కింగ్ కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తుంది. అతన్ని జట్టు నుంచి తప్పించి యువ క్రికెటర్లకు చోటు కల్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ సిరీస్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. కానీ.. కోహ్లీ లాంటి ఆటగాడు అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి జట్టులో ఉండడం ఎంతో ముఖ్యం. కానీ.. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్‌లోనే కొనసాగితే అతను జట్టులో ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక తనపై వస్తున్న విమర్శల నుంచి, పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి నుంచి బయట పడేందుకు కోహ్లీనే వెస్టిండీస్ సిరీస్ నుంచి విశ్రాంతి కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి సెలెక్టర్లే విశ్రాంతి ఇచ్చారా? లేక కోహ్లీనే రెస్ట్ కోరుకున్నాడా? అనే విషయం పక్కన పెడితే. అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కల్లా విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐ పెద్దలు సైతం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోహ్లీని ఫామ్‌లోకి తెచ్చేందుకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. అందుకోసం ఆగస్టు 18, 20, 22 తేదీల్లో టీమిండియా జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడమని బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కోహ్లీ వెస్టిండీస్ సిరీస్ ముగిసిన తర్వాత.. నేరుగా ఆసియా కప్ కోసం జట్టులో చేరనున్నాడు. అప్పటి వరకు తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ ఇదివరకే బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. కానీ.. గంగూలీ ప్లాన్ ప్రకారం.. విరాట్‌ను ఫామ్‌లోకి తెచ్చుకోవడానికి జింబాబ్వే సిరీస్‌ను వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. పసికూన బౌలర్లను ఎదుర్కొని విరాట్ పరుగులు చేయగలిగితే.. అతనికి కొంత ఆత్వవిశ్వాసం వస్తుంది. అలాగే అదే ఊపులో ఒక సెంచరీ కొట్టేస్తే.. ఆ సెంచరీ ఒత్తిడి కూడా దూరమవుతుందని దాదా ప్లాన్. ఇలా జింబాబ్వేతో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి.. ఆ తర్వాత ఆసియా కప్‌తో మరింత పుంజుకుని అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ కల్లా పాత కోహ్లీని సిద్దం చేయాలని గంగూలీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే.. జింబాబ్వే సిరీస్‌లో కోహ్లీని ఆడమని సెలెక్టర్ల చేత గంగూలీ రిక్వెస్ట్ చేయించినట్లు తెలుస్తుంది. మరి దాదా ప్లాన్ ప్రకారం కోహ్లీ జింబాబ్వేతో సిరీస్‌లో ఆడాతాడో లేదో వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.