దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమతించిన 736 మంది ఓటర్లలో (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు.. పార్లమెంట్ హౌస్‌లో ఓటు హక్కు వినిగియోగించుకున్నారు. ఇక, రాష్ట్రాల శాసనసభలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీల నుంచి బ్యాలెట్ బాక్సులను ఈ రాత్రి కల్లా ఢిల్లీలోని పార్లమెంట్‌కు తరలిస్తామని వెల్లడించారు. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక..తెలుగు రాష్ట్రాలకు విషయానికొస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపగా, ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేరు వేరుగా మద్దతు ప్రకటించాయి. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం.. 118 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో.. 117 తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలవి కాగా, మరోకటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి చెందినది. ఇక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 ఓట్లలో కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోవడంతో 174 ఓట్లు పోల్ అవ్వాలి. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయని తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ: గంగుల కమలాకర్(కరీంనగర్) చెన్నమనేని రమేష్(వేములవాడ) ఆంధ్రప్రదేశ్: నందమూరి బాలకృష్ణ(టీడీపీ) గోరంట్ల బుచ్చయ్య చౌదరి(టీడీపీ) రాష్ట్రపతిని ఎలక్టోరల్ సభ్యులు ఎన్నుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: జాక్ పాట్.. టాయిలెట్ నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ బంగారు నాణెలు! ఇది కూడా చదవండి: R Bindu: కిడ్నీ పేషెంట్‌ని చూసి చలించిన మహిళా మంత్రి.. ఆమె చేసిన పనిపై ప్రశంసలు!