మాయమైపోతున్నాడమ్మ మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న కవి మాటలు వాస్తవరూపం దాలుస్తున్న పరిస్థితులు నేడు. ఉరుకుపరుగుల జీవితం మనిషిని శాసిస్తుంది. ఒక్క నిమిషం ఆగావా.. ఏళ్లు వెనకబడతావ్ అనే పరిస్థితి తయారయ్యింది. అసలు మన ఇంట్లోనే ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక లేదు.. ఇక మన చుట్టూ ఏం జరుగుతుందో ఎలా చూడగలుగుతాం. ప్రతిది ఆర్థిక కోణంలోనే చూడటం పరిపాటి అయ్యింది. బాధలో ఉన్నవారిని పలకరిస్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని భయంతో ముఖం చాటేస్తుంటాం. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముక్కుపచ్చలారని చిన్నారులను వదిలి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్న పిల్లాడు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని తరలించడానికి వాహనం కోసం ప్రయత్నిస్తే.. ప్రతి ఒక్కరు ఎక్కువ ధర చెప్పినవారే. ఈ క్రమంలో పిల్లాడి తండ్రి తమ్ముడి మృతదేహాన్ని అన్న ఒడిలో కూర్చోపెట్టి వాహనం కోసం వెళ్లాడు. రోడ్డు వెంట వెళ్లే ప్రతి ఒక్కరు ఆ బాలుడిని గమనిస్తున్నారు.. కానీ సాయం చేయడానికి ముందుకు రాలేదు. పాపం ఆ చిన్నారి గంటల తరబడి తమ్ముడి మృతదేహాన్ని ఒడిలో కూర్చోపెట్టుకుని అలాగే ఉన్నాడు. ఆ దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఆ వివరాలు.. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మురైనా జిల్లా అంబాహ్ మండలం బడ్‌ఫరా గ్రామానికి చెందిన పూజారామ్ జాటవ్‌కు నలుగురు పిల్లలు. 3-4 నెలల క్రితం భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను పూజారామ్ ఒక్కడే చూసుకుంటున్నాడు. రెండేళ్ల చిన్న కుమారుడికి కొంతకాలంగా ఆరోగ్యం బాగుండడం లేదు. రక్తహీనత, కడుపులో నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అంబాహ్ ఆస్పత్రి వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం మురైనా జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఓ అంబులెన్స్ మాట్లాడుకుని పెద్దాస్పత్రికి వచ్చాడు పూజారామ్. అయితే.. దురదృష్టవశాత్తూ ఆ బాలుడు చనిపోయాడు. దాంతో పూజారామ్, అతడితోపాటు వచ్చిన 8 ఏళ్ల పెద్ద కుమారుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహంతో ఆస్పత్రి బయటకు వచ్చి.. ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. వారిని స్వగ్రామం నుంచి మురైనాకు తీసుకొచ్చిన అంబులెన్స్ అప్పటికే వెళ్లిపోయింది. మరో వాహనం కోసం ప్రయత్నిస్తే.. డ్రైవర్ రూ.1500 అడిగాడు. అంత సొమ్ము లేని పూజారామ్.. కాస్త తక్కువ ధరలో ఏమైనా దొరుకుతుందేమోనని వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడ్ని ఆస్పత్రి బయట రోడ్డు పక్కనే కూర్చోబెట్టి, అతడి ఒడిలో మృతదేహాన్ని పెట్టి.. వాహనం కోసం వెళ్లాడు పూజారామ్. తక్కువ డబ్బులకే స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఎవరైనా సహకరిస్తారన్న ఆశతో.. ప్రైవేటు వాహనాల డ్రైవర్లను బతిమలాడుతూ ఉన్నాడు. తమ్ముడు పోయాడన్న బాధ తప్ప పేదరికం కష్టాల గురించి సరిగా తెలియని పెద్ద కుమారుడు.. ఒడిలో మృతదేహంతో అలానే అనేగ గంటలపాటు కూర్చున్నాడు. స్థానికులు వీరి బాధను గుర్తించారు. కానీ ఏం చేయలేకపోయారు. కాసేపటికి పోలీసులు వచ్చారు. కోత్వాలీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్.. చిన్నారి మృతదేహాన్ని, అతడి సోదరుడ్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే కాసేపు మృతదేహాన్ని ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా పూజారామ్ వచ్చాడు. చివరకు ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి.. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి పంపించారు ఆస్పత్రి సిబ్బంది. అప్పటివరకు మాత్రం ఏం జరుగుతుందో తెలియక ఆ 8 ఏళ్ల బాలుడు.. ఏడుస్తూ ఉండిపోయాడు. ఇది స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Madhya Pradesh: నా మొగుడు కనిపించడం లేదంటూ భార్య కంప్లైంట్.. పోలీసుల విచారణలో ఖంగుతినే నిజాలు! ఇది కూడా చదవండి: Madhya pradesh: బుల్డోజర్ పై ఊరేగింపులో వచ్చిన వరుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!