చెన్నై (రీసెర్చ్ డెస్క్)- మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కమల్ కు ఎన్నికల్లో తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదరైంది. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి కమల్ హాసన్ పోటీ చేయగా ఆయనపై బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ గెలిచారు. దీంతో కమల్ గెలిచిన వనతి ఎవరా అని అంతా గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. వనతి శ్రీనివాసన్ వృత్తి పరంగా సీనియర్ అడ్వకేట్. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు బీఎస్ జ్ఞానదేశికన్ వద్ద ఆమె 1993లో తన కెరీర్ ప్రారంభించారు. 1970 జూన్ 6న కోయంబత్తూరులోని తొడముత్తూర్ బ్లాకులో ఉలియంపాలాయం అనే గ్రామంలో వనతి జన్మించారు. కొండస్వామి, పూవతల్ ఆమె తల్లిదండ్రులు. తొడముత్తూర్లో స్కూలు విద్యనభ్యసించిన వనతి, హైయర్ సెకండరీ స్కూల్లో కెమిస్ట్రీ సబ్జెక్టులో బ్యాచ్ టాపర్. ఆ తర్వాత న్యాయవాద వృత్తిపై మక్కువతో లా చదివారు. చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ లా కాలేజ్ నుంచి 1993లో పట్టా పొందారు. ఆపై అంతర్జాతీయ రాజ్యంగం విభాగంలో మద్రాస్ యూనివర్సిటీలో 1995లో మాస్టర్స్ పూర్తి చేశారు. శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్న వనతికి ఇద్దరు అబ్బాయిలు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు లాయర్‌గా సేవలందించిన వనతి శ్రీనివాస్ 2012లో అప్పటి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఇక్బాల్ చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ వుమెన్ లాయర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. బీజేపీలో వనతి ప్రస్థానం మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున 2016 ఎన్నికల్లో పోటీ చేసిన వనతి శ్రీనివాస్ కు 33 వేల 113 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో కమల్ హాసన్‌పై 1728 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. అదన్నమాట సంగతి. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్ హాసన్ కనీసం తానైనా గెలుస్తారానుకుంటే వనతి చేతిలో ఓటమిపాలయ్యారు.