Ram Charan: గత కొన్నిరోజులుగా టాలీవుడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే.. టాలీవుడ్ ప్రధాన సమస్యలలో సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజులు, ఇండస్ట్రీలోని అంతర్గత సమస్యలు, హీరోల రెమ్యునరేషన్స్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కొంతకాలంగా చిత్రపరిశ్రమలో ఈ సమస్యలు కొనసాగుతుండటంతో సినీపెద్దలు వరుస మీటింగ్స్ జరుపుతున్నారు. ఇటీవల ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశంలో ప్రధాన సమస్యలపై చర్చలు జరిపి, సమస్యలు పరిష్కారం అయ్యేదాక షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో షూటింగ్స్ బంద్ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగనున్నాడు. నిర్మాత దిల్ రాజు.. రామ్ చరణ్ తో ఇండస్ట్రీలోని సమస్యల గురించి చెప్పడంతో పాటు హీరోల సైడ్ నుండి ఉన్న సమస్యలను హీరోలందరితో మాట్లాడమని అడిగారట. అందుకు రామ్ చరణ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో దిల్ రాజు ముఖ్యంగా హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించాలని, హీరోల అసిస్టెంట్స్ కి ఖర్చులు వారే పెట్టుకోవాలని, టైమ్ సెన్స్ పాటించాలని, హీరోల డేట్స్ అడ్జస్ట్ చేయడంలో మేనేజర్స్ తో సమస్యలు ఉన్నాయని రామ్ చరణ్ కి తెలిపినట్లు సమాచారం. ఇక వచ్చేవారంలో రామ్ చరణ్ టాలీవుడ్ హీరోలందరితో సమావేశమై, ఈ సమస్యలపై చర్చిస్తానని దిల్ రాజుతో చెప్పినట్లు తెలుస్తుంది. అంతేగాక హీరోల సైడ్ ఉన్న సమస్యల గురించి తాను మాట్లాడతానని ప్రొడ్యూసర్ గిల్డ్ కి చరణ్ భరోసా ఇచ్చారట. రంగంలోకి రామ్ చరణ్ దిగి హీరోలందరితో మాట్లాడతానని చెప్పడంతో సమస్యల పరిష్కారంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.