ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించేది దర్శకులే అయినప్పటికీ వారికంటూ ఫేవరేట్ హీరోలు ఉంటారనే సంగతి తెలిసిందే. ఎందుకంటే డైరెక్టర్ అవ్వడం కంటే ముందు వాళ్లు కూడా సినీ అభిమానులే. కాబట్టి.. ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ ఉండటం మామూలే. అయితే.. కొందరు దర్శకుల విషయంలో హీరోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా ఎంతోమంది స్టార్లను అభిమానించి, వారితో ఒక్క సినిమా అయినా చేయాలనే కసితో డైరెక్టర్స్ అయినవాళ్లు ఎందరో ఉన్నారు. ఒక్కడు సినిమా చూసి మహేష్ బాబుతో సినిమా తీయాలని డ్రీమ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి, అనుకున్నట్లుగానే 'సర్కారు వారి పాట' సినిమా తీశాడు పరశురామ్. కమల్ హాసన్ కి వీరాభిమాని అయిన లోకేష్ కనగరాజ్.. ఇటీవల 'విక్రమ్' తీసి ఆల్ టైమ్ హిట్ అందించాడు. ఇలా ఫేవరేట్ హీరోలతో సినిమాలు తీస్తూ డ్రీమ్స్ నెరవేర్చుకుంటున్న దర్శకుల లిస్టులో చేరాలని అనుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ చేసిన చందూ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమమ్ తెరకెక్కించి మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'కార్తికేయ 2' రూపొందించి రిలీజ్ కి రెడీ చేశాడు. ఈ క్రమంలో ఆగష్టు 13న కార్తికేయ సీక్వెల్ రిలీజ్ అవుతుండగా.. నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' ప్రోగ్రాంలో పాల్గొన్న చందూ.. తన ఫేవరేట్ హీరోతో సినిమా గురించి ప్రస్తావించాడు. ఇక తనకు ఫేవరేట్ హీరో అక్కినేని నాగార్జున అని చెప్పిన చందూ.. అభిమాన హీరో కోసం ఓ పోలీస్ కథను రెడీ చేస్తున్నానని, కమల్ హాసన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'విక్రమ్' లాంటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ నాగార్జున గారి కోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అదీగాక తనకు, నాగార్జునకు మధ్య అప్పుడప్పుడు కథా చర్చలు కూడా జరుగుతుంటాయని చెప్పడం విశేషం. అయితే.. చందూ మాటలు విన్నప్పటి నుండి అక్కినేని ఫ్యాన్స్ లో హుషారు మామూలుగా లేదు. చందూ - నాగ్ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమా అనౌన్స్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. మరి చందూ - నాగ్ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.