ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు రావు గోపాల రావుకి తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మా మామయ్య అల్లూ రామలింగయ్య, రావుగోపాల్ రావు కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్లిద్దరూ తెరపై ఎలా ఉన్నా.. బయట మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవారు. అందుకే నేను రావుగోపాల రావు ని చిన మామయ్య అని పిలిచేవాడిని అన్నారు. ఆయన కుటుంబంతో నాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది. ఆయన నాపై ఎంతో ఆప్యాయత.. ప్రేమ చూపించేవారు. షూటింగ్ జరిగే సమయంలో విరామం దొరికితే ఇంటి నుంచి ప్రత్యేకంగా నాకోసం భోజనం తెచ్చేవారు. ఒకసారి నేను వంకాయ వదిలివేయడంతో ‘ఏమయ్యా.. మీరలా వంకాయ వదిలివేయడం బాగాలేదు.. మీ అత్తయ్య మీ కోసమే ప్రత్యేకంగా పెట్టారు.. ఆ వంకాయ చూడండి ఎలా నిగ నిగలాడుతుందో అచ్చం శ్రీదేవి బుగ్గల్లా లేవూ.. మీలాంటి కుర్రాళ్లు టక్కున కొరికి మింగేయాలి’ అంటూ మొత్తానికి ఆ వంకాయ నాతో తినిపించారని అచ్చం రావు గోపాల రావులా ఇమిటేట్ చేస్తూ చిరంజీవి అందరినీ నవ్వించారు. ఇక రావు గోపాలరావు సతీమణి అదే మా చిన అత్తయ్య నాకోసం ప్రత్యేకంగా తులసి చారు చేసి పంపించేవారు. ఏ వంటకం అయినా నేను తినే వరకు ఓపికతో ఉండి నాతో తినిపించేవారు ఆయన. అంతగొప్ప అనుబంధం వాళ్ల కుటుంబంతో నాకు ఉండేది అన్నారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రావు రమేష్ ఉత్తమమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు మాటలతో రావురమేశ్ ఉద్వేగానికి గురయ్యారు. చిరు కాళ్లకు నమస్కరించి.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.