‘ I don't stop when I'm tired. I only stop when I'm done ’ - Marilyn Monroe ఇది నాలుగు పదాల కలయిక మాత్రమే కాదు.. కొంతమంది జీవితం కూడా. మార్లిన్ మన్రో చెప్పినట్లు కొంతమంది అలసటతో ఆగిపోరు.. తాము అనుకున్నది సాధించి.. ఇక చాలు అనుకున్నపుడు మాత్రమే ఆగిపోతారు. అంత వరకు ఆవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటారు. అంతా అయిపోయిందని అందరూ అనుకున్న చోటే అద్భుతాలు చేస్తారు. నేలకు కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. అచ్చం నటి ఛార్మీ లాగా. దాదాపు పదేళ్ల సినిమా కెరీర్‌లో ఛార్మీ ఓ జీవితానికి సరిపడా అనుభవాల్ని సొంతం చేసుకుంది. ఆ పదేళ్ల జీవితమే ఆమెను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది. ముందు కంటే బరువైన బాధ్యతలతో.. ఉన్నతమైన లక్ష్యాలతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. 2001 మే 27 సినిమా అంటే ఏంటో తెలియని పసితనం. షూటింగ్‌లో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని అమాయకత్వం. 13 ఏళ్లకే సినిమా కెరీర్‌ను ప్రారంభించింది ఛార్మీ. జూనియర్ ఆర్టిస్ట్‌గా ‘ముజ్‌సే దోస్తీ కరోగి’ సినిమా చేసింది. కొన్నినెలల తర్వాత తెలుగులో అవకాశాన్ని దక్కించుకుంది. మార్చి 28, 2002 హీరోయిన్‌గా ఛార్మీ మొదటి సినిమా ‘‘ నీ తోడు కావాలి’’ రిలీజైంది. ఈ సినిమాలో నటించే సమయానికి ఆమె వయసు 15 ఏళ్లు మాత్రమే. ‘‘ ఎక్స్‌క్యూజ్ మీ.. ఈ ప్లవర్స్ ఎంత?’’ తన మొదటి సినిమాలో చార్మీ చెప్పిన మొదటి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ తర్వాత ఛార్మీకి హీరోతో గొడవవుతుంది. పూలు తీసుకోకుండానే వెళ్లిపోతుంది. ‘నీ జీవితం పూల పాన్పు కాదు!’ అని విధి ఛార్మీని వెక్కిరిస్తున్నట్లుగా.. మొదటి సినిమాతోటే ప్లాప్‌ను మూటగట్టుకుంది. కేవలం తెలుగులోనే కాదు.. ఆమె హీరోయిన్‌గా తమిళంలో చేసిన ‘కాదల్ అలివదిల్లయ్’.. మలయళంలో చేసిన ‘ కట్టుచెంబాకమ్’ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇవన్నీ 2002లో రిలీజై వరుస ప్లాపులుగా నిలిచాయి. సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిలు.. తమ సినిమాలు బాగా ఆడటం లేదన్న బాధతో సినిమాలు తీయటమే మానేస్తారు. లేదా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. కానీ, ఛార్మీ ఇందుకు భిన్నం. అన్నింటిని తట్టుకుని నిలబడింది. సినిమాలను ఓ ప్యాషన్‌గా భావించింది. గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంతో సినిమాలు చేసింది. అలా కెరీర్‌ను ప్రారంభించిన దాదాపు మూడేళ్లకు ‘మాస్’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. కానీ, చెప్పుకోదగ్గ హిట్లు రాలేదు. 2012 తర్వాత హీరోయిన్‌గా ఛార్మీ కెరీర్ ఒకరకంగా ముగిసిపోయింది. గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలకు ఆమె ఎక్కువ పరిమితం అయింది. మనం చేసే స్నేహాలే మన జీవితాన్ని నిర్ధేశిస్తాయి అన్నది అక్షర సత్యం. ఛార్మీ విషయంలోనూ అదే జరిగింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో స్నేహం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. పూరీ చొరవతో ప్రొడ్యూషర్‌గా మారింది. అతి తక్కువ మంది ఆడవాళ్లకు మాత్రమే సొంతమైన ఘనతను సాధించింది. సినిమా నిర్మాణం అంటే చిన్న విషయం కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. అది ఆడవాళ్ల విషయంలో అయితే మరీను. ఇండస్ట్రీలో జరిగే మోసాలను, రాజకీయాలను తట్టుకోవటం చాలా కష్టం. అది తెలిసి కూడా మొండి ధైర్యంతో ఛార్మీ ముందడుగు వేసింది. ‘జ్యోతి లక్ష్మి’లో లీడ్ రోల్ చేయటమేకాక, సినిమాను నిర్మించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. 2017నుంచి నటనకు స్వప్తి పలికి, సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వస్తోంది. నేడు ఓ ప్యాన్ ఇండియా సినిమా ప్రొడ్యూషర్‌గా మారింది. పూరీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విషయంలో ఛార్మీ తీసుకున్న శ్రధ్ధ, పడ్డ కష్టం అంతా ఇంతా కాదు! ఒకరకంగా అన్నీ తానై సినిమాను ముందుకు నడిపించింది. రేయింబవళ్లు సినిమాకోసం కష్టపడింది. మగాడికి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా సినిమా కోసం శ్రమించింది. సినిమా ప్రమోషన్లలో తీరికలేకుండా గడుపుతోంది. ఇదే సమయంలో ఛార్మీ వ్యక్తిగత జీవితంపై విమర్శలు కూడా పెరిగిపోయాయి. పూరీకి ఛార్మీకి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేయటం మొదలుపెట్టారు కొందరు. అవతలి వ్యక్తి మహిళ అయితే చాలు.. రెచ్చిపోయి వారి వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు చేసే కొన్ని మూకలు ఆమెపై విరుచుకుపడుతున్నాయి. జీవితంతో పోరాడి ఓ మగాడికి ఏ మాత్రం తక్కువ కాదంటూ ముందుకు దూసుకెళ్తున్న ఛార్మీలో లోపాలను వెతకటం ఎంత వరకు కరెక్ట్... దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి : Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అప్పటి నుంచి స్టార్ట్.. అఫీషియల్ డేట్..