Sri Krishnashtami 2022: ‘కార్తికేయ 2’ సినిమా నేడు దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శ్రీ మహా విష్ణువు ఎనిమిద అవతారం.. హిందువుల ఆరాధ్య దైవం ‘శ్రీ కృష్ణ’ భగవానుడే ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా చెప్పినా.. పురాణాలు చెప్పినా శ్రీ కృష్ణుడు మానవ రూపంలోని దైవం. మానవుడిగా జన్మించి దైవత్వాన్ని పొందిన మహానుభావుడు. ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఈ నేలపై మానవ రూపంలో తిరుగాడిన కారణ జన్ముడు. చిన్నతనంలోనే రాక్షస సంహారం చేసినా.. ప్రజల కోసం గోవర్థన గిరిని చిటికెన వేలుపై మోసినా.. మహా భారత యుద్దంలో జ్ఞాన భోద చేసినా.. ధర్మ కోసం ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయం. చెరసాలలో పుట్టి.. యశోద ఇంటికి చేరి.. శ్రీ కృష్ణుడు శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు చెరసాలలో ఉన్న దేవకీ గర్భాన జన్మించాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు బాల కృష్ణుడ్ని నందనవనంలోని తన మిత్రుడు నందుని ఇంట ఉంచాడు. శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు. పాలు తాగే ప్రాయంలో తనను చంపటానికి మేనమామ కంసుడు పంపిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తననోటిలో అండ పిండ బ్రహ్మాండాలను చూపించాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి వ్రేపల్లె వాసులను కాపాడాడు. శ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహమాడాడు. మహా భారతంలో శ్రీ భగవద్గీత ఉపదేశం.. శ్రీకృష్ణుని నిర్యాణం శ్రీకృష్ణుడికి మేనత్త కుమారులైన పాండవులతో మంచి అనుంబంధం ఉండేది. ఒక్క జూదం విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో శ్రీకృష్ణుడి నిర్ణయాల ప్రకారమే పాండవులు నడుచుకునేవారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. మహా భారత యుద్ధానంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం పుట్టి అందరి మరణానికీ కారణమయ్యింది. యాదవకుల అంతం తర్వాత కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని ( పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడి గురించి చరిత్రలో.. కృష్ణుని గురించిన ప్రస్తావన లభించిన మొట్టమొదటి గ్రంథం ( చరిత్ర కారుల అంచనా ప్రకారం ) ఛాందోగ్యోపనిషత్తు. ఇందులో కృష్ణుడు దేవకి సుతుడని, ఘోర అంగీరసుని శిష్యుడని చెప్పబడింది. క్రీ.పూ. 180-165 కాలంలో గ్రీకో-బాక్ట్రియన్ పాలకుడు "అగాథకిల్స్" కృష్ణ బలరాములున్న నాణేలను ముద్రించాడు. క్రీ.పూ. 1వ శతాబ్దంలో గ్రీస్‌కు చెందిన హెలిడోరస్ భిల్సా సమీపంలో బేసన్‌గర్ వద్ద ఒక స్తంభ శాసనాన్ని వేయించాడు. ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్‌లో లభించిన క్రీ.పూ. 800 నాటి ఒక చిత్రంలో సుదర్శన చక్రం ధరించిన రథసారథిని కృష్ణుడని అనుకోవచ్చును. చివరగా శ్రీకృష్ణుడు అంటే?.. గీతతో కోట్లమందికి దారి చూపించిన గొప్ప గురువు. రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన గొప్ప ఆర్కిటెక్ట్. చూపుతోనే మనసులోని మాట చెప్పిన గొప్ప సైకాలజిస్టు. వేణు గానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసిన గొప్ప మెజీషియన్. నిత్యం ఆరోగ్యంతోనే ఉండే సూచనలు చెప్పిన గొప్ప డాక్టర్. ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన గొప్ప వీరుడు. కరువు కష్టం తెలియకుండా తన ప్రజలను చూసుకున్న గొప్ప రాజు. హోమయాగాలతో వర్షం తెప్పించిన ప్రకృతిని అర్థం చేసుకున్న గొప్ప క్లైమేటాలజిస్ట్. అన్ కంట్రోలబుల్ ఆర్పియంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసిన గొప్ప కైనటిక్ ఇంజనీర్.