Nellore: రోడ్డు ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి నరక వేదన అనుభవించాడు ఓ క్లీనర్. 40 నిమిషాల పాటు ప్రాణం కోసం గిలగిల్లాడాడు. కాపాడమని బ్రతిమాలుతూనే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా గోపవరం మండలం వడ్డే అగ్రహారం గ్రామానికి చెందిన మేముల వెంకటేష్ ఓ లారీకి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం డ్రైవర్ చెంగారి సురేష్‌తో పాలు, పెరుగు లోడు లారీతో ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లాడు. లారీ నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజీ సమీపంలోకి రాగానే అక్కడే రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ టమోటా లోడు లారీని ఢీకొట్టింది. దీంతో వెంకటేష్ ఉన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. వెంకటేష్ అందులో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక, నొప్పి భరించలేక అల్లాడిపోయాడు. దాదాపు 40 నిమిషాల పాటు సహాయం కోసం వేడుకున్నాడు. సహాయం చేయటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అంబులెన్స్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. కాపాడండి.. కాపాడండి.. అంటూ చివరకు నరక వేదన అనుభవించి ప్రాణాలు వదిలాడు. ఇక, డ్రైవర్ సురేష్ తీవ్రగాయాల పాలయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Khammam: తమ్ముడికి రాఖీ కడదాం అనుకుంది.. కానీ, విగతజీవిగా చూసి..