Arundhati: దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ‘అరుంధతి’ ఒకటి. అనుష్క, సోనూసూద్‌లు ప్రధాన పాత్రల్లో.. హర్రర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కి రికార్డులు సృష్టించింది. ఇక, ఈ సినిమా స్పూర్తితో తాజాగా ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒంటిపై 20 లీటర్ల పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని తుంకూరు జిల్లా, మధుగిరి తాలూకాకు చెందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ ‘అరుంధతి’సినిమాకు బానిసయ్యాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 24 సార్లు చూశాడు. విలన్‌ను చంపటంకోసం ఆయుధాన్ని తయారు చేయటానికి జేజమ్మ తన ప్రాణాలను బలిస్తుంది. ఈ సీన్ ప్రసాద్‌ను బాగా ప్రభావితం చేసింది. తాను కూడా తన ప్రాణాలను వదిలేస్తే.. స్వేచ్ఛ పొందుతానని అతడు భావించాడు. పలుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ చదువు మధ్యలోనే మానేశాడు. కొద్దిరోజుల క్రితం 20 లీటర్ల పెట్రోల్ తీసుకుని ఊరి బయటకు వెళ్లాడు. మొత్తం పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ బాధ తట్టుకోలేక కేకలు పెట్టసాగాడు. ఈ నేపథ్యంలో అటు వైపు వెళ్తున్న కొంతమంది యువకులు అతడ్ని చూశారు. మంటలు ఆర్పి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం విక్టోరియాకు రిఫెర్ చేశారు. కుటుంబసభ్యులు ప్రసాద్‌ను విక్టోరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ప్రసాద్ కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : సివిల్స్ కోచింగ్ పేరుతో జల్సాలు.. ఉన్నత లక్ష్యాన్ని గాలికొదిలేసి..!