2020 ఏప్రిల్ 17 దేవరకద్ర మండలం పేరూరు శివారు ప్రాంతం శ్మశాన వాటిక నిర్మాణం కోసం కూలీలు గుంతలు తవ్వుతున్నారు. అలా గుంతలు తవ్వుతుండగా ఊహించని పరిణామం చేటుచేసుకుంది. ఓ చోట ఓ మహిళ చీర, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. దీంతో కూలీలంతా షాక్ తిన్నట్లు అయ్యారు. ఈ విషయం చకచకా ఊరు మొత్తం పాకిపోయింది. పోలీసులకు కూడా సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. ఫోరెన్సిక్ టీంను కూడా రప్పించారు. చీర, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. నిపుణులు చీర, ఎముకలపై జరిపిన పరిశోధనల్లో సదరు వ్యక్తులు చనిపోయి దాదాపు 8-10 సంవత్సరాలు అయి ఉంటుందని తేలింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు. గత పదేళ్లలో తప్పిపోయిన మహిళల వివరాలను బయటకుతీశారు. అందులో శాంతమ్మ పేరు కొంత అనుమానంగా అనిపించింది. ఇందుకు కారణం లేకపోలేదు. శాంతమ్మ కూడా అదే ప్రాంతానికి చెందినది. శాంతమ్మ కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. అయితే, ఇక్కడ అంతుచిక్కని విషయం ఏంటంటే ఆమె శాంతమ్మనే అని ఎలా గుర్తించటం?. అప్పుడు పోలీసులు డీఎన్‌ఏ టెస్ట్ వైపు మొగ్గుచూపారు. శాంతమ్మ కుమారుడితో పేరూరులో దొరికిన ఎముకల డీఎన్‌ఏను పోల్చి చూశారు. ఇద్దరి డీఎన్‌ఏ ఒకటే అని తేలింది. పేరూరు శివారులో దొరికిన ఎముకలు శాంతమ్మవేనని పోలీసులు ధ్రువీకరణకు వచ్చారు. ఒక సమస్య తీరింది. కానీ, మరో సమస్య వచ్చిపడింది. ఇంతకీ శాంతమ్మ ఎలా చనిపోయింది?. అక్కడ ఆమెను ఎవరు పూడ్చారు? ఇలా చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలోనే పేరూర్ సర్పంచ్ నుంచి పోలీసులకు ఓ సమాచారం అందింది. శాంతమ్మను తామే చంపామని, ఆమెతో పాటు ఆమె భర్తను కూడా హత్య చేశామని ఓ ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు. పోలీసులు ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. 8 ఏళ్ల క్రితం... పేరూర్‌కు చెందిన బోయ ఆంజనేయులు, బోయ శాంతమ్మ భార్యాభర్తలు. ఇద్దరూ కూలీ పని చేసుకుని జీవనం సాగించేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎంతో ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలోకి బుర్రన్ అనే వ్యక్తి రూపంలో తుఫాన్ వచ్చింది. దేవరకద్ర మండంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్ బొగ్గు వ్యాపారం చేసేవాడు. ఆంజనేయులకు బుర్రన్‌తో పరిచయం ఏర్పడింది. బుర్రన్‌తో ఉన్న పరిచయంతో ఆంజనేయులు అతడి వద్దనుంచి 20 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అప్పు తిరిగి తీసుకోవటం కోసం బుర్రన్.. ఆంజనేయులు ఇంటికి తరచూ వెళ్లటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే శాంతమ్మకు బుర్రన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆంజనేయులుకు తెలియకుండా శాంతమ్మ, బుర్రన్ తరచుగా కలిసేవారు. శారీరక సంబంధాన్ని కొనసాగించేవారు. అయితే, ఆ నిజం ఎక్కువ కాలం దాగలేదు. బుర్రన్, శాంతమ్మల వివాహేతర సంబంధం ఆంజనేయులుకు తెలిసింది. దీంతో అతడు ఆగ్రహంతో రగిలిపోయాడు. తన భార్య జోలికి రావొద్దంటూ బుర్రన్‌ను హెచ్చరించాడు. ఆంజనేయులు తనను బెదిరించటంతో బుర్రన్ అహం దెబ్బతింది. ‘నా దగ్గర డబ్బులు తీసుకుని, నన్నే బెదిరిస్తాడా?’ అని అనుకున్నాడు. అప్పుడు అతడి బుర్రలో ఓ క్రూరమైన ఆలోచన మెదిలింది. ఆంజనేయుల్ని చంపేస్తే తన అహం దెబ్బతినటంతోపాటు శాంతమ్మతో బంధానికి అడ్డం ఉండదు అనుకున్నాడు. ఓ పక్కా ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడు. 2014 ఏప్రిల్ 19 బుర్రన్ ఆంజనేయులుకు ఫోన్ చేశాడు. అప్పు, శాంతమ్మల విషయం మాట్లాడాలన్నాడు. ఓ చోటు చెప్పి, రమ్మన్నాడు. ఆంజనేయులు సరేనన్నాడు. ఆంజనేయులు వస్తున్నాడని ధ్రువీకరించుకున్న తర్వాత బుర్రన్ తన బావమరుదులైన నానేష్, మహమ్మద్ రఫీలను తోడుగా తీసుకెళ్లాడు. వారికి పథకం ముందుగానే వివరించాడు. బుర్రన్ చెప్పిన చోటుకు ఆంజనేయులు వచ్చాడు. అప్పటికే ముగ్గురు అక్కడ ఉన్నారు. బుర్రన్, ఆంజనేయులతో మాట్లాడుతూనే పెద్దమునగల్ చేడ్ గ్రామ శివారులోని ఓ పొలంలోకి తీసుకెళ్లాడు. తర్వాత ముగ్గురు కలిసి అతడి గొంతు నులిమి చంపేశారు. శవాన్ని అక్కడే పూడ్చేశారు. ఆంజనేయులు పీడ విరగడ అయింది కాబట్టి శాంతమ్మతో హ్యాపీగా ఉండొచ్చని బుర్రన్ భావించాడు. సంతోషంగా శాంతమ్మ దగ్గరకు వెళ్లాడు. భర్తను చంపిన విషయాన్ని ఆమెకు చెప్పాడు. అయితే, శాంతమ్మ నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. భర్తను చంపేయటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అతడిపై అరిచింది. విషయం బయటకు చెబుతానని అంది. దీంతో బుర్రన్ భయపడిపోయాడు. విషయం ఎక్కడ బయటకు తెలుస్తుందోనని అనుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పేరూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ చీరకొంగుతో ఆమె గొంతు బిగించి చంపేశాడు. శాంతమ్మ శవాన్ని ముగ్గురు అక్కడే పూడ్చిపెట్టారు. ఆంజనేయులు, శాంతమ్మ కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయినప్పటికి ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దంపతుల మిస్సింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత దంపతుల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. రఫీ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి, సినిమాను తలపించే ఈ రియల్ క్రైం స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : ప్రియుడి కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న టీనేజ్ అమ్మాయిలు.. ప్రియుడు ఏం చేశాడో తెలుసా?